‘అమ్మ’తో మౌలిక వసతులు | Sakshi
Sakshi News home page

‘అమ్మ’తో మౌలిక వసతులు

Published Tue, Apr 23 2024 8:40 AM

-

● పాఠశాలల్లో టాయిలెట్లు, విద్యుత్‌, అదనపు గదుల కల్పన ● జిల్లాకు రూ. 21.46కోట్లు నిధులు ● పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చని అమ్మ ఆదర్శ కమిటీలు

అశ్వారావుపేట : గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతుంటారు. ముఖ్యంగా యుక్త వయసున్న బాలికలను టాయిలెట్లు లేని పాఠశాలలకు పంపేందుకు వారు ముందుకు రారు.. బాలికలు కూడా బడికి వెళ్లేందుకు నిరాకరిస్తుంటారు. ఈ సమస్యను పలువురు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి నివేదించడంతో గత ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం చేపట్టింది. దీనికి ప్రజల భాగస్వామ్యం కావాలంటూ నిధుల సమీకరణకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దాతల స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో లక్ష్యం నేరవేరలేదు. ఇక రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. పాత ప్రతిపాదనలను పక్కన పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించింది. వీటిలో అత్యంత ప్రాముఖ్యమైన బాలికల టాయిలెట్లు, అదనపు గదులు, మైనర్‌ రిపేర్లు, విద్యుద్దీకరణలకు మండల స్థాయి నుంచి పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీని ప్రకారం జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని అన్ని మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని మండలాల ఇంజనీరింగ్‌ అధికారులు.. వీఓ అధ్యక్షులు, పాఠశాల హెచ్‌ఎంలతో సమావేశాలు నిర్వహించారు. కాగా మంగళవారం పాఠశాలలకు చివరి పనిదినం కావడంతో పాటు ఈ రోజే కమిటీల ఏర్పాటు, ఫొటో అప్‌లోడ్‌ ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇవన్నీ సకాలంలో పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక వేసవి కాలంలో ఎలక్ట్రికల్‌, శానిటేషన్‌, ప్లంబింగ్‌ కార్మికులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. మరి చేతిలో చిల్లిగవ్వ లేకుండా వీవో సంఘాల ద్వారా పనులు చేయించడం ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంగళవారం సాయంత్రానికి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో పనికి ముందు పరిస్థితిని ఫొటోలతో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అయితే ఇప్పటికే కొన్ని పాఠశాలలు వీటిని అప్‌లోడ్‌ చేసినా.. ఆయా పాఠశాలల కమిటీల ఖాతాల్లో అడ్వాన్స్‌గా 25 శాతం నిధులు జమ కాలేదు.

Advertisement
Advertisement