ఐటీ పరిశ్రమకు భారీ షాక్‌.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్‌’ | Sakshi
Sakshi News home page

ఐటీ పరిశ్రమకు భారీ షాక్‌.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్‌’

Published Sat, Mar 9 2024 1:02 PM

AI Will Lead To 70 Percentage Layoffs In IT Jobs - Sakshi

కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్‌లైన్‌లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది.

అదే సమయంలో ఉద్యోగాలకు ఏఐ ఎసరుపెడుతుందని, మనిషి అవసరాన్ని తగ్గించేస్తుందన్న బెరుకు వ్యక్తమవుతోంది. ఏఐ ప్రపంచంలో గొప్ప అవకాశాలతోపాటు అనిశ్చితులూ మన కోసం ఎదురుచూస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాక‌తో ముఖ్యంగా ఐటీ ప‌రిశ్ర‌మ‌లో కొలువుల కోత‌పై ఆందోళ‌న నెల‌కొంది. మ‌నుషులు చేసే ఉద్యోగాల‌ను ఏఐ రీప్లేస్ చేస్తుంద‌నే భ‌యాలు టెకీల్లో గుబులు రేపుతున్నాయి. ఏఐ టూల్స్‌తో ఐటీ ప‌రిశ్ర‌మ‌లో సిబ్బంది అవ‌స‌రాల‌ను 70 శాతం త‌గ్గించ‌వ‌చ్చ‌ని హెచ్‌సీఎల్ మాజీ సీఈవో వినీత్‌నాయర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందో చర్చించారు. ఈ సందర్భంగా ఆటోమేష‌న్‌తో మాస్ లేఆఫ్స్ త‌ప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకునే బ‌దులు ప్ర‌స్తుత ఉద్యోగుల నైపుణ్యాల‌ను మెరుగుప‌ర‌చాల‌ని సూచించారు.

చాట్‌జీపీటీ, జెమిని, కోపైల‌ట్ వంటి ఏఐ టూల్స్ రాక‌తో లేటెస్ట్ టెక్నాల‌జీ టూల్స్‌తో సంప్ర‌దాయ ఉద్యోగాలు క‌నుమరుగవుతాయ‌నే ఆందోళ‌న‌ల మ‌ధ్య హెచ్‌సీఎల్ మాజీ సీఈవో వినీత్‌ నాయ‌ర్ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రిచుకున్నాయి. ఏఐ టూల్స్ కార‌ణంగా కంపెనీల హైరింగ్ అవ‌స‌రాలు 70 శాతం త‌గ్గుతాయ‌ని ఆయన స్ప‌ష్టం చేశారు.

ఇదీ చదవండి: 2జీ, 3జీ, 4జీ, 5జీ.. తరాల్లో మతులబు

ఐటీ ఉద్యోగులు చేప‌ట్టే కోడింగ్‌, టెస్టింగ్, మెయింటెనెన్స్‌, ట్ర‌బుల్ టికెట్స్ రెస్పాండింగ్ స్కిల్స్‌ను ఏఐ చేప‌డుతుంద‌ని చెప్పారు. ఆపై ఈ నైపుణ్యాల‌న్నీ వాడుక‌లో లేనివిగా మార‌తాయ‌ని, ఫ‌లితంగా పెద్ద‌సంఖ్య‌లో లేఆఫ్స్ చూస్తామ‌ని నాయ‌ర్ హెచ్చ‌రించారు. అయితే ఏఐకి సూచనలు ఇవ్వాలంటే ఉద్యోగులు అవసరం. కాబట్టి ఆ దిశగా వారికి నైపుణ్యాలు నేర్పాలని తెలిపారు. భార‌త ఐటీ కంపెనీల‌కు ఏఐ అపార అవ‌కాశాలు క‌ల్పిస్తుంద‌ని వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement