టీ20 ప్రపంచకప్‌ 2024లో తొలి వికెట్‌ డౌన్‌ | T20 World Cup 2024: Oman Eliminated After Defeat Against Scotland | Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్‌ 2024లో తొలి వికెట్‌ డౌన్‌

Published Mon, Jun 10 2024 10:46 AM | Last Updated on Mon, Jun 10 2024 10:51 AM

T20 World Cup 2024: Oman Eliminated After Defeat Against Scotland

యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2024లో తొలి వికెట్‌ పడింది. మెగా టోర్నీ నుంచి ఓ జట్టు నిష్క్రమించింది. గ్రూప్‌-బి నుంచి ఒమన్‌ తదుపరి దశకు చేరకుండా ఎలిమినేట్‌ అయ్యింది. నిన్న (జూన్‌ 9) స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన అనంతరం ఒమన్‌ అధికారికంగా ప్రపంచకప్‌ నుంచి వైదొలిగింది. 

మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఒమన్‌ సూపర్‌-8కు అర్హత సాధించకుండానే ఇంటిదారి పట్టనుంది. ఈ టోర్నీలో ఒమన్‌ మరో మ్యాచ్‌ (జూన్‌ 13న ఇంగ్లండ్‌తో) ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండానే ఒమన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.

కాగా, ఆంటిగ్వా వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఒమన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ప్రతిక్‌  అథవాలే (54) అర్ద సెంచరీతో రాణించగా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ అయాన్‌ ఖాన్‌ (41 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో సఫ్యాన్‌ షరీఫ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. మార్క్‌ వాట్‌, వీల్‌, క్రిస్టఫర్‌ సోల్‌, క్రిస్‌ గ్రీవ్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్‌.. బ్రాండెన్‌ మెక్‌ముల్లెన్‌ (31 బంతుల్లో 61 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), జార్జ్‌ మున్సే (20 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడటంతో 13.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఒమన్‌ బౌలర్లలో బిలాల్‌ ఖాన్‌, ఆకిబ్‌ ఇలియాస్‌, మెహ్రన్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో స్కాట్లాండ్‌ రన్‌రేట్‌ను బాగా మెరుగుపర్చుకుని టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement