టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (జూన్ 16) జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల చరిత్రలో స్కాట్లాండ్ ఇదే అత్యధిక స్కోర్. 2022 ఎడిషన్‌లో ఐర్లాండ్‌పై చేసిన 176 పరుగులు ఈ మ్యాచ్ ముందు వరకు ఆ జట్టు అత్యధిక స్కోర్‌గా ఉండింది. నేటి మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఓడినా రికార్డు నెలకొల్పింది.
మ్యాచ్ విషయానికొస్తే.. సూపర్-8కు చేరే క్రమంలో స్కాట్లాండ్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకమై ఉండింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే స్కాట్లాండ్ సూపర్-8కు చేరి ఉండేది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఓడటం.. నమీబియాపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించడంతో ఇంగ్లండ్ సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఇదివరకే ఆస్ట్రేలియా సూపర్-8కు క్వాలిఫై అయ్యింది.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (60), బెర్రింగ్టన్ (42 నాటౌట్), మున్సే (35) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 2, ఆస్టన్ అగర్, నాథన్ ఇల్లిస్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (68), మార్కస్ స్టోయినిస్ (59), టిమ్ డేవిడ్ (24 నాటౌట్) చెలరేగడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్, షరీఫ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్ వీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment