పొట్టి ప్రపంచకప్‌లో పాక్‌పై టీమిండియా మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా దాయాదితో నిన్న (జూన్ 9) జరిగిన మ్యాచ్‌లో మరోసారి భారత్‌దే పైచేయిగా నిలిచింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
ముఖ్యంగా బుమ్రా (4-0-13-3, హార్దిక్ (4-0-24-2) తమ అనుభవాన్నంత రంగరించి ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించారు. బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలించని పిచ్‌పై తొలుత రిషబ్ పంత్ (42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. స్వల్ప లక్ష్యాన్ని నిలదొక్కుకునే క్రమంలో భారత పేసర్లు మాయ చేశారు. ఫలితంగా భారత్ 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సూపర్-8 బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
మ్యాచ్ అనంతరం టీమిండియా విజయంపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. వాస్తవానికి మేము సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఇన్నింగ్స్ సగం వరకు మంచి స్థితిలోనే ఉన్నాము. ఆ దశలో సరైన భాగస్వామ్యాలు నెలకొల్పి ఉంటే ఓ మోస్తరు స్కోర్ చేసి ఉండే వాళ్లం. ఇలాంటి పిచ్‌పై ప్రతి పరుగు ముఖ్యమే అని ముందే అనుకున్నాము. ఐర్లాండ్ మ్యాచ్‌తో పోలిస్తే నేటి పిచ్ కాస్త మెరుగ్గా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా మంచి వికెట్. బౌలర్లకు కావాల్సినంత దొరుకుతుంది.
మ్యాచ్ సగానికి వచ్చినప్పుడు (ఛేదనలో) ఓ విషయం మాట్లాడుకున్నాం. మా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలినప్పుడు, వారి బ్యాటింగ్ లైనప్ ఎందుకు కుప్పకూలదని ఛాలెంజ్‌గా తీసుకున్నాం. తలో చేయి వేస్తే ఇది తప్పక సాధ్యపడుతుందని నమ్మాం. అదే చేసి చూపించాం. ముఖ్యంగా బుమ్రా. అతనే పాక్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అతని శక్తి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. మాకందరికీ తెలుసు అతను ఏమి చేయగలడో. అతని గురించి ఎక్కువగా మాట్లాడను. వరల్డ్‌కప్ పూర్తయ్యే వరకు అతను ఈ మైండ్ సెట్‌లోనే ఉండాలని కోరుకుంటున్నాను.
ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ.. ఇక్కడి జనం అద్భుతంగా ఉన్నారు. మేం ఎక్కడ ఆడినా వారు నిరాశపరచరు. ఈ మ్యాచ్ చూశాక వారు చిరునవ్వుతో ఇంటికి వెళతారని అనుకుంటున్నాను. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. పాక్ పేసర్లు చెలరేగడంతో 19 ఓవర్లలో 119 పరుగులకు చాపచుట్టేసింది. నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం భారత పేసర్లు సైతం విజృంభిండంతో పాక్ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. భారత బౌలర్లలో బుమ్రా, హార్దిక్‌తో పాటు సిరాజ్ (4-0-19-0), అర్ష్‌దీప్ (4-0-31-1), అక్షర్ (2-0-11-1) కూడా రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ చేతిలో ఓటమితో పాక్ సూపర్-8 అవకాశాలు గల్లంతు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment