T20 WC 2024- India vs Pakistan: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ అనుసరించిన బౌలింగ్ వ్యూహాలను భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తప్పుబట్టాడు. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు మూడో ఓవర్లో బంతిని ఇవ్వడమేమిటని ప్రశ్నించాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసినట్లే.. బుమ్రాను కూడా తొలి ఓవర్లోనే ఉపయోగించుకోవాలని సూచించాడు. నిజానికి పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియాను బౌలర్లే గట్టెక్కించారని.. ఈ విజయంలో క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలని గావస్కర్ పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా భారత్- పాకిస్తాన్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారీ అంచనాలతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 119 పరుగులకే కుప్పకూలింది.
ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (13), విరాట్ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. 31 బంతుల్లో 42 పరుగులతో పంత్ దుమ్ములేపగా.. అక్షర్ పటేల్ 20 పరుగులతో రాణించాడు.
మిగతా వాళ్లంత సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటర్లను.. టీమిండియా బౌలర్లు ఆది నుంచే కట్టడి చేశారు. వీరి దెబ్బకు పాక్ బ్యాటింగ్ ఆర్డర్ 113 పరుగులకే కుప్పకూలింది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జస్‌ప్రీత్ బుమ్రా (3/14), హార్దిక్ పాండ్యా (2/24) అద్భుతంగా రాణించగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
అయితే, ఈ మ్యాచ్‌లో బౌలింగ్ అటాక్‌ను అర్ష్‌దీప్ సింగ్ ప్రారంభించడం విశేషం. తొలి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి బంతిని అందించాడు. మహ్మద్ సిరాజ్ రెండో ఓవర్ వేయగా.. బుమ్రా మూడో ఓవర్‌లో యాక్షన్‌లోకి దిగాడు.
బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోవడమేమిటి?
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ భారత్- పాక్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత క్రికెట్‌లో బౌలర్లూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
వాళ్లు తిరిగి పుంజుకోవడం అద్భుతంగా అనిపించింది. అయినా.. బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోవడమేమిటి? మూడో ఓవర్లో అతడికి చేతికి బంతినిస్తారా?
మొదటి 12 బంతులు ఎందుకు వృథా చేశారు? మీ జట్టులో ఉన్న అత్యుత్తమ బౌలర్‌కే కదా మొదటగా బంతిని ఇవ్వాల్సింది. రోహిత్ శర్మ లేదంటే విరాట్ కోహ్లిని ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రమ్మని చెప్తారా?
చెప్పరు కదా?!.. వాళ్లిద్దరు అత్యుత్తమ బ్యాటర్లు కాబట్టి టాపార్డర్‌లోనే వస్తారు. మరి ఈ ప్రధాన బౌలర్ విషయంలో మాత్రం ఎందుకిలా?’’ అని గావస్కర్ టీమిండియా సారథి రోహిత్ వ్యూహాలను విమర్శించాడు.
చెత్త షాట్లతో వికెట్లు కోల్పోయి
అదే విధంగా టీమిండియా బ్యాటర్ల తీరుపైనా గావస్కర్ విమర్శలు గుప్పించాడు. అనవసరపు షాట్లకు యత్నించి వికెట్లు పారేసుకోవడం ఏమిటని మండిపడ్డాడు. ఏదేమైనా పాక్‌పై టీమిండియా మ్యాచ్ గెలవడం మాత్రం సంతోషంగా ఉందంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment