టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్ 9) జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో అద్భుత విజయం సాధించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో బుమ్రా తన ప్రతాపాన్ని చూపి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు (బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్) తీశాడు. భారత్ విజయావకాశాలు పూర్తిగా అడుగంటిన వేళ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మ్యాచ్ రూపురేఖల్నే మార్చేసింది.
ఆ ఓవర్‌లో బుమ్రా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రమాదకారిగా కనిపించిన ఇఫ్తికార్ అహ్మద్‌ను ఔట్ చేశాడు. తన మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ కారణంగా బుమ్రా వరుసగా రెండో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించాడు.
పాక్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత బౌలర్లు ఆదిలో విఫలమయ్యారు. 4 ఓవర్లలో పాక్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసి లక్ష్యంగా దిశగా సాగుతుండింది. ఈ దశలో (ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో) బుమ్రా తన అనుభవాన్నంతా రంగరించి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ఔట్ చేశాడు.
అనంతరం ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో మరోసారి బంతిని అందుకున్న బుమ్రా ఈ సారి అప్పటికే క్రీజ్‌లో సెట్ అయిపోయిన రిజ్వాన్‌ను ఔట్‌ను చేసి భారత శిబిరంలో గెలుపుపై ఆశలకు బీజం పోశాడు. ఈ మధ్యలో హార్దిక్ పాండ్యా (4-0-24-2) రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను రక్తి కట్టించగా.. బుమ్రా 19వ ఓవర్‌లో మరోసారి తన ప్రతాపాన్ని చూపాడు. పాక్ గెలుపు ఖాయమనుకున్న వేళ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలకమైన ఇఫ్తికార్ వికెట్ తీసి పాక్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.
పాక్ గెలుపుకు చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. చివరి ఓవర్ నాలుగు, ఐదు బంతులకు నసీం షా బౌండరీలు బాదినప్పటికీ పాక్ ఓటమి అప్పటికే ఖరారైపోయింది. బుమ్రా ప్రదర్శన కారణంగా ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి, సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకుంది.
టీ20ల్లో భారత్ డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ (120), టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఏ జట్టైనా డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ ఇదే కావడం విశేషం. పాక్‌పై ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో దాయాదిపై తమ రికార్డును (7-1) మరింత మెరుగుపర్చుకుంది. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ బుమ్రా పాక్‌పై ఇలాంటి మ్యాచ్ విన్నింగ్స్ పెర్ఫార్మెన్సే (2/19) కనబర్చి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో బుమ్రాతో పాటు హార్దిక్ చూపిన పట్టుదలకు క్రికెట్ ప్రపంచం మొత్తం జేజేలు పలుకుతుంది. గెలుపు సునాయాసమనుకున్న మ్యాచ్‌లో ఓడటంతో పాక్ ఆటగాళ్లు, అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. పాక్‌పై గెలుపు అనంతరం న్యూయార్క్ మైదానంలో భారత అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. పాక్ పేసర్లు చెలరేగడంతో 19 ఓవర్లలో 119 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం భారత పేసర్లు సైతం విజృంభించి పాక్‌కు సాధ్యమైంది తమకెందుకు సాధ్యం కాదన్న రీతిలో ప్రతిఘటించి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించారు. భారత బౌలర్ల దెబ్బకు పాక్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసినప్పటికీ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు చేతిలో ఇంకా 3 వికెట్లు ఉన్నాయి.
బుమ్రా, హార్దిక్‌తో పాటు సిరాజ్ (4-0-19-0), అర్ష్‌దీప్ (4-0-31-1), అక్షర్ (2-0-11-1) కూడా రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు పంత్ (42) రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ సూపర్-8 అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.
Comments
Please login to add a commentAdd a comment