ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సూపర్ హిట్ అవుతుందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలా కాకుండా ఈ ఈవెంట్ పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఉపఖండ దేశాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యానే తాను ఈ మాట చెప్తున్నట్లు సల్మాన్ బట్ పేర్కొన్నాడు.
రూ. 167 కోట్ల మేర నష్టం
గతేడాది నుంచి ఐసీసీ టోర్నీల జాతర జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 నిర్వహించగా.. అమెరికా- వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్-2024కు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. అయితే, క్రికెట్‌కు అంతగా క్రేజ్‌లేని అమెరికాలో తొలిసారిగా ఈ ఈవెంట్ నిర్వహించడం వల్ల ఐసీసీ భారీగా నష్టపోయిందనే వార్తలు వచ్చాయి.
సుమారు రూ. 167 కోట్ల మేర ఐసీసీ అపెక్స్ కౌన్సిల్‌కు నష్టం వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అమెరికాలో జరిగిన టీ20 టోర్నీకి.. మా దేశంలో జరిగే ఈవెంట్‌కు అసలు పోలికే ఉండదు.
టీ20 వరల్డ్‌కప్ కంటే చాంపియన్స్ ట్రోఫీ పెద్ద హిట్ అవుతుంది. నిజానికి అక్కడ(అమెరికా) పిచ్‌లు సరిగా లేవు. జనావాసాలకు స్టేడియాలు చాలా దూరం. అంతేకాదు హోటల్స్ కూడా ఎక్కడో దూరంగా ఉంటాయి. అసలు అక్కడి స్థానికులకు కూడా తమ సిటీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
భద్రత విషయంలోనూ
విదేశీయులు మాత్రమే అక్కడికి వెళ్లి మ్యాచ్‌లు వీక్షించారు. అయితే, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఇక్కడి ప్రజలు ఆటగాళ్లను ఆదరించడంతో పాటు ప్రేమిస్తారు, గౌరవిస్తారు కూడా! క్రికెట్ అంటే ఇక్కడి వాళ్లకు చాలా ఇష్టం.
అలాగే జట్లు గంటల పాటు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. మహా అయితే.. ఆరు నిమిషాల్లో టీమ్ హోటల్ నుంచి స్టేడియానికి చేరుకోవచ్చు. భద్రత విషయంలోనూ ఎలాంటి సందేహాలు ఉండవు. ఉపఖండ దేశాల్లో ఉన్నట్లు అమెరికాలో క్రికెటర్లకు క్రేజ్ ఉండదు’’ అని సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు.
కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం టీమిండియా పాకిస్తాన్ వెళ్లే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు కోసం ఐసీసీ.. బీసీసీఐ కోరినట్లుగానే పాక్ వెలుపల వేదిక ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment