PhonePe Launches UPI Lite For Low-Value Payments - Sakshi
Sakshi News home page

ఫోన్‌పే యూజర్లకు అలర్ట్‌: చిన్న చిన్న లావాదేవీల కోసం పిన్‌ అక‍్కర్లేదు!

Published Thu, May 4 2023 11:16 AM

Phonepe Launches Upi Lite For Smaller Payments - Sakshi

ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్‌ కంపెనీ ఫోన్‌పే యూపీఐ పేమెంట్‌ కోసం లైట్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫీచర్‌ వల్ల రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీల కోసం ఎలాంటి పిన్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది.

ఇప్పటికే ఫోన్‌పే ప్రత్యర్ధి సంస్థ పేటీఎం ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో యూపీఐ లైట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఫోన్‌పే సైతం ఈ సరికొత్త సేవల్ని వినియోగించేలా యూజర్లకు అవకాశం కల్పించింది. 

చిన్న చెల్లింపుల కోసం ముందుగానే యూపీఐ లైట్‌లో రూ.2,000 వరకు జమ చేసుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. ఫలితంగా బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా వేగంగా చెల్లింపులు పూర్తవుతాయి. చెల్లింపులు జరిగే సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉండవని వెల్లడించింది.  

అన్నీ బ్యాంకుల సపోర్ట్‌ 
ఫోన్‌పే యూపీఐ లైట్‌కు దేశంలో అన్నీ బ్యాంకుల్లో వినియోగించుకోవచ్చని ఆ సంస్థ సీఈవో సమీర్‌ నిఘమ్‌ చెప్పారు. యూపీఐ మర్చంట్‌, క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులకు అనుమతిస్తున్నట్లు  పేర్కొన్నారు.

బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌తో పనిలేదు
వీటితో పాటు యూపీఐ లైట్‌ వినియోగంతో ఆయా ట్రాన్సాక్షన్‌లపై యూజర్లకు మెసేజ్‌ అలెర్ట్‌ వెళ్లనుంది. యూజర్లు ఏ రోజు ఎన్ని లావాదేవీలు జరిపారో తెలుసుకునేందుకు వీలుగా ట్రాన్సాక్షన్‌ హిస్టరీ చూడొచ్చు. దీనికి సంబంధించి మెసేజ్‌ అలెర్ట్‌ పొందవచ్చు. తద్వారా చెల్లింపులపై బ్యాంక్‌ స్టేట్మెంట్‌, పాస్‌బుక్‌ అవసరం తీరిపోనుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

చెల్లింపుల్ని సులభతరం చేసేందుకే 
అయితే ఈ యూపీఐ లైట్‌ ఫీచర్‌ ద్వారా దేశంలో ప్రతి రోజు జరిగే చిన్న చిన్న లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఫోన్‌పేలో ఈ కొత్త ఆప్షన్‌ను అభివృద్ది చేసినట్లు ఫోన్‌పే కో- ఫౌండర్‌, సీటీవో రాహుల్‌ చారి చెప్పినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఎన్‌సీపీఐ నిర్ణయం.. యూపీఐ లైట్‌కి ఊతం
ఇటీవల కాలంలో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలలో జరిపే లావాదేవీల సమయంలో నెట్‌వర్క్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేలా గత ఏడాది డిసెంబర్‌లో నేషనల్ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీపీఐ) నెట్‌వర్క్‌ లేకపోయినా రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీలు జరిపేలా అనుమతిచ్చింది.  

చదవండి👉 కొనసాగుతున్న తొలగింపులు.. దిగ్గజ ఐటీ కంపెనీలో 600 మందిపై వేటు! 

Advertisement
 
Advertisement