వెల్డర్ నుంచి సామాజిక కార్యకర్త దాకా
సామాజిక సమస్యలే ఎజెండాగా పోటీ
దండల్లేవు. నినాదాల్లేవు. పెద్ద ఎత్తున ప్రజానీకం లేరు. లౌడ్ స్పీకర్లు అసలే లేవు. ప్రచారానికి నిధులు కూడా లేవు. అ యినా ఇల్లిల్లూ తిరుగుతూ ఓట్లడుగుతున్నారు. వారంతా ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన 49 మంది స్వతంత్ర అభ్యర్థులు.
వీరిలో ఓ బహుళజాతి సంస్థ ఉద్యోగి మొదలుకుని వెల్డ ర్, మెకానిక్, సామాజిక కార్యకర్త, స్టాక్ ట్రేడర్ దాకా రకరకాల వాళ్లున్నారు. వీరిలో 67 ఏళ్ల సుభాష్ చందర్ హరియాణాలోని సిర్సా వాసి. కాలుష్యంతో ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారిపోయిందన్నది ఆయన ఆవేదన. దీన్ని ఎత్తి చూపేందుకే చాందినీ చౌక్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగానని చెబుతున్నాడు. డబ్బు ఆదా చేసేందుకు రాత్రుళ్లు గురుద్వారాల్లో బస చేస్తున్నాడు.
రూ.10కే భోజనం పెడతా
సౌత్ ఢిల్లీ బరిలో ఉన్న శంకర్ రాజధానిలో పోటీ చేస్తున్న ఏకైక బెంగాలీ అభ్యర్థి! 30 ఏళ్లు ఢిల్లీలోనే ప్రభుత్వోద్యోగం చేసి రిటైరయ్యారు. గెలిచినా ఓడినా ఎన్నికల తర్వాత ఢిల్లీలో ప్రజలకు రూ.10కే కడుపునిండా భోజనం అందిస్తానని ధీమాగా చెబుతున్నాడు! అచ్లా జెఠ్మలానీ ఓ బహుళజాతి సంస్థలో మంచి హోదాలో పని చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బాసూరీ స్వరాజ్, సోమనాథ్ భారతిలతో తలపడుతున్నారు.
పెచ్చరిల్లిన నిరుద్యోగంపై పోరాడేందుకే బరిలో దిగానంటున్నారు. ఉద్యోగిగా పొదుపు చేసుకున్న డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. సౌత్ ఢిల్లీలో బరిలో ఉన్న నవీన్‌కుమార్ వృత్తిరీత్యా వెల్డర్. చదువుకోలేదు. అందుకే సరైన విద్యా వ్యవస్థ కోసం బరిలో దిగాడు. ఆయన కోసం 12 మందితో కూడిన బృందం పని చేస్తోంది. తనకు 6 లక్షల ఓట్లు ఖాయమంటున్నాడు! వెస్ట్ ఢిల్లీ నుంచి బరిలో ఉన్న సామాజిక కార్యకర్త అంజు శర్మ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకురాలు.
– న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment