ప్రైవేట్‌ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి | Pvt bus from Hyderabad met with accident in AP | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి

Published Fri, May 24 2024 4:56 AM | Last Updated on Fri, May 24 2024 4:56 AM

Pvt bus from Hyderabad met with accident in AP

21 మందికి గాయాలు 

హైదరాబాద్‌ నుంచి ఆదోనికి వెళ్తుండగా కోడుమూరు వద్ద ప్రమాదం 

డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఘోరం

కోడుమూరు రూరల్‌: డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేట్‌ ఏసీ స్లీపర్‌ బస్సు బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందారు. మరో 21మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు... ఆదోనిలోని బిస్మిల్లా ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్‌ బస్సు బుధవారం రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి ఆదోనికి బయలుదేరింది. కోడుమూరు వద్ద లారీని ఓవర్‌టేక్‌ చేసేందుకు డ్రైవర్‌ అతివేగంగా వెళ్లే క్రమంలో బస్సు బోల్తా పడింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులు తమను రక్షించాలని హాహాకారాలు చేశారు.

కోడుమూరు సీఐ మన్సురుద్దీన్, ఎస్‌ఐ బాలనరసింహులు తమ సిబ్బందితో వచ్చి స్థానికుల సాయంతో బస్సు అద్దాలను పగులగొట్టి గాయపడినవారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె ధనలక్ష్మి (13), సురేష్‌ కుమార్తె గోవర్దనీ(9) మరణించారు. వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన వీరిద్దరూ తమ మేనత్త కృష్ణవేణితో కలిసి ఆదోనికి బస్సులో వెళుతూ గాఢ నిద్రలోనే కన్నుమూశారు. హైదరాబాద్, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులకు చెందిన కృష్ణవేణి, పుష్పావతి, మౌనిక, అశోక్, భారతి, గౌస్‌మొహిద్దీన్, పినిశెట్టి లక్ష్మి, వెంకటరెడ్డితోపాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

బోయ శకుంతల, శివరాముడు, లక్ష్మి, గణేష్‌, అశోక్‌కుమార్‌లతోపాటు మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు 108 అంబులెన్స్‌లలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు, డ్రైవర్, ఇద్దరు క్లీనర్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్లు పరారైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు డీఎస్పీ విజయశేఖర్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement