bus overturn
-
ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి
కోడుమూరు రూరల్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందారు. మరో 21మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు... ఆదోనిలోని బిస్మిల్లా ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు బుధవారం రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఆదోనికి బయలుదేరింది. కోడుమూరు వద్ద లారీని ఓవర్టేక్ చేసేందుకు డ్రైవర్ అతివేగంగా వెళ్లే క్రమంలో బస్సు బోల్తా పడింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులు తమను రక్షించాలని హాహాకారాలు చేశారు.కోడుమూరు సీఐ మన్సురుద్దీన్, ఎస్ఐ బాలనరసింహులు తమ సిబ్బందితో వచ్చి స్థానికుల సాయంతో బస్సు అద్దాలను పగులగొట్టి గాయపడినవారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె ధనలక్ష్మి (13), సురేష్ కుమార్తె గోవర్దనీ(9) మరణించారు. వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన వీరిద్దరూ తమ మేనత్త కృష్ణవేణితో కలిసి ఆదోనికి బస్సులో వెళుతూ గాఢ నిద్రలోనే కన్నుమూశారు. హైదరాబాద్, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులకు చెందిన కృష్ణవేణి, పుష్పావతి, మౌనిక, అశోక్, భారతి, గౌస్‌మొహిద్దీన్, పినిశెట్టి లక్ష్మి, వెంకటరెడ్డితోపాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.బోయ శకుంతల, శివరాముడు, లక్ష్మి, గణేష్, అశోక్‌కుమార్‌లతోపాటు మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు 108 అంబులెన్స్‌లలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు, డ్రైవర్, ఇద్దరు క్లీనర్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్లు పరారైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు డీఎస్పీ విజయశేఖర్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రమాదం.. పల్టీ కొట్టిన బస్సు...
సూర్యాపేట: మునగాల మండలం మాధవరం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు! -
రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా ప్రమాదం..
అహ్మదాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 35 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. తాపి జిల్లా కంజా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్పారు. నర్మదా జిల్లాలోని దేదియపడ బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ కార్యకర్తల కోసం బస్సులు ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం కంజా వద్ద వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. కాగా ఎక్కడి నుంచి వీరిని బహిరంగ సభకు తీసుకువెళ్తున్నారన్న విషయం తెలియరాలేదు. క్షతగాత్రులను సూరత్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని బర్దోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంధువుల పెళ్లికి రెండు బస్సుల్లో బయల్దేరిన బృందం ప్రమాదానికి గురైంది. ఈ బస్సులు నల్లగొండ జిల్లా పరిధిలో ఉండగా వాటిలో ఒక బస్సు డివైడర్ పైకి ఎక్కడంతో పల్టీకొట్టింది. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాకు తమ అన్నకొడుకు పెళ్లి కోసం బయల్దేరామని, ఇంతలో ఉన్నట్టుండి ఈ ప్రమాదం జరిగిందని, బస్సు మొత్తం తుక్కు తుక్కు అయినా అదృష్టవశాత్తు కొంతమంది గాయాలతోనే బయటపడ్డామని, ఎవరూ ప్రాణాలు మాత్రం కోల్పోలేదని క్షతగాత్రుల్లో ఒకరు తెలిపారు. గాయపడిన వారిని నల్లగొండ జిల్లా భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.