ఆర్ట్‌ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుతున్న.. 'గౌరి మినోచా' | Sakshi
Sakshi News home page

ఆర్ట్‌ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుతున్న.. 'గౌరి మినోచా'

Published Thu, Feb 29 2024 11:53 AM

The Future With Art Psychotherapy Gauri Minocha - Sakshi

'నవతరం ఆలోచనలు సృజనాత్మకంగానే కాదు జనంతో మమేకం అయ్యే విషయాలపట్ల అవగాహనతోనూ ఉంటున్నాయనడానికి ఉదాహరణ గౌరీ మినోచా. ఢిల్లీ వాసి అయిన గౌరి ఆర్ట్‌ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుకుంటున్న వర్ధమాన కళాకారిణి. అభిరుచితో నేర్చుకున్న పెయింటింగ్‌ ఆర్ట్, చదువుతో ఒంటపట్టించుకున్న సైకాలజీ ఈ రెండింటి కాంబినేషన్‌తో రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ కనుక్కుంది. ఈ శైలిలోనే వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తూ స్కూల్, కాలేజీ పిల్లల మానసిక ఒత్తిడులను దూరం చేస్తుంది. ఆర్ట్‌ సైకోథెరపీతో ప్రజాదరణ పొందుతూ ఈ తరానికి కొత్త స్ఫూర్తిని అందిస్తోంది. తను ఎంచుకున్న మార్గం గురించి ప్రస్తావిస్తూ..'

‘‘కళ–మనస్తత్వ శాస్త్రం రెండూ హృదయానికి దగ్గరగా ఉంటాయి. నేను ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజీలో సైకాలజీ బిఏ ఆనర్స్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ చదువుతున్నాను. పన్నెండవ తరగతిలో 99 శాతం మార్కులు రావడంతో సైకాలజీని ఎంచుకున్నాను. ఢిల్లీలో ఆర్ట్‌ సైకోథెరపీ సెంటర్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాను. కళ – మనస్తత్వ శాస్త్రం రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌లు. ఆర్ట్‌ సైకోథెరపీలో... డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు పెయింటింగ్స్‌ వేసి వారికి ఇస్తుంటాను.

వారి చేత కూడా రంగులతో నచ్చిన అంశాన్ని ఎంచుకొని చిత్రించమని అడుగుతాను. వారికి ఏమీ రాకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా వారిలో నిరాశ, ఆందోళన స్థాయులను చెక్‌ చేస్తాను. ఇదొక రిలాక్సేషన్‌ టెక్నిక్‌. విదేశాలలో చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ మన దేశంలో ఇప్పటికీ అంత ప్రజాదరణ పొందలేదు. దీనికి కొన్ని స్కూళ్లు, కాలేజీలను ఎంచుకొని ఉచితంగా వర్క్‌షాప్స్‌ కూడా నిర్వహిస్తుంటాను. 

చిన్ననాటి నుంచి..
మా అమ్మ ఆర్టిస్ట్‌. వ్యాపారవేత్త కూడా. ఒక ఆర్ట్‌ గ్యాలరీని కూడా నడుపుతోంది. ఇందులో అనేకమంది ప్రసిద్ధ కళాకారుల పెయింటింగ్‌ ప్రదర్శనలు జరుగుతాయి. ఆమె పిల్లలకు, పెద్దలకు పెయింటింగ్‌ క్లాసులు కూడా తీసుకుంటుంది. రంగులు, చిత్రాలు, కళాకారుల మధ్య నా బాల్యం గడిచింది. అలా నాకు చిత్ర కళ పట్ల అభిరుచి పెరిగింది. ఒకసారి ఎమ్‌ఎఫ్‌ హుస్సేన్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ జరిగినప్పుడు అతని గుర్రపు పెయింటింగ్‌ను కాపీ చేశాను. అమ్మ నాలో ఉన్న ఆర్టిస్ట్‌ను గుర్తించి, సహకరించింది. ఈ కళలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. కళతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాను. 

ఒత్తిడి లేకుండా చదువు.. నేను క్లాస్‌రూమ్‌లో కంటే ఆర్ట్‌ రూమ్‌లో ఎక్కువ సమయం గడిపాను. కానీ, నా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కాలేజీ స్థాయికి వచ్చాక ఆర్ట్‌ నీ సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి స్టూడెంట్‌లాగే నేనూ నా కెరియర్‌ గురించి తీవ్రంగా ఆలోచించాను. గ్రాడ్యుయేషన్‌ ఆర్ట్స్‌లో చేయాలా, సైకాలజీలో ఏ సబ్జెక్ట్‌ చేయాలో అర్థం కాక కొన్నిరోజులు మథనపడ్డాను. కానీ, ఆర్ట్‌ నా అభిరుచి, కెరియర్‌ సైకాలజీ రెండింటిలోప్రావీణ్యం సాధించాలనుకున్నాను. పగలు కాలేజీ, రాత్రి సమయంలో ఎంతసేపు వీలుంటే అంత టైమ్‌ పెయింటింగ్‌ చేస్తుంటాను. 

వ్యాపారంలోనూ నైపుణ్యం.. స్కూల్‌ ఏజ్‌ నుంచే నా పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేసే దాన్ని. మొదటి పెయింటింగ్‌కు ఐదు వేల రూపాయలు వచ్చాయి. మొదట్లో నా పెయింటింగ్స్‌ని బంధువులందరికీ పంపాను. తమ ఇంట్లో పెయింటింగ్స్‌ అలంకరించినప్పుడు వారి ఇళ్లకు వచ్చిన బంధువులు ఆ పెయింటింగ్స్‌ చూసి తమకూ పంపమని కాల్స్‌ చేయడంప్రారంభించారు.

విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి నా పెయింటింగ్స్‌ అమెరికా, లండన్, ముంబై, ఢిల్లీ సహా అనేకప్రాంతాలకు చేరాయి. ఈ రోజు ఢిల్లీని ఆర్ట్‌ హబ్‌లో నా 12 పెయింటింగ్స్‌లో 9 అమ్మకానికి ఉన్నాయి. ప్రతి కళాకారుడు తన సొంత మార్కెట్‌ విలువను సృష్టించుకోవడం, ప్రచారం కూడా ముఖ్యం. సృజనాత్మకతతోపాటు వ్యాపారంలో కూడా నైపుణ్యం సాధించాలి’’ అంటూ నవతరానికి బిజినెస్‌ టెక్నిక్స్‌ కూడా చెబుతుంది గౌరి మినోచా.

ఇవి చదవండి: WPL 2024: తొలి మహిళా క్యూరేటర్‌ జసింత

Advertisement
 
Advertisement
 
Advertisement