Do You Know About This Gujarat Cafe, Offers Free Food In Exchange For Plastic Waste - Sakshi
Sakshi News home page

Free Food In Natural Plastic Cafe: ఈ హోటల్‌లో ఫ్రీగా నచ్చినంత తినొచ్చు.. కానీ ఓ కండిషన్‌

Published Thu, Jul 27 2023 10:14 AM

This Gujarat Cafe Offers Food In Exchange For Plastic - Sakshi

ఈ హోటల్‌లో ఏదైనా ఆర్డర్‌ ఇవ్వండి.. కడుపు నిండా తినండి. ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు! అవును మీరు కరెక్ట్‌గానే చదివారు. తిన్నంత తిని డబ్బులు వద్దు అంటున్నారు అని సంతోషపడిపోకండి! ఎందుకంటే డబ్బులకు బదులు ప్లాస్టిక్‌ ఇవ్వాలండోయ్‌. 

ప్లాస్టిక్‌పై నిషేధం విధించినప్పటికీ... ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వ అధికారులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా ప్లాస్టిక్‌ వ్యర్థాలు తగ్గడంలేదు. ఈ సమస్యను అధిగమించేందుకు... గుజరాత్‌లోని జునాఘడ్‌కు కలెక్టర్‌గా పనిచేస్తోన్న రచిత్‌ రాజ్‌ ‘ప్రకృతి’ పేరిట సరికొత్త కాన్సెప్ట్‌తో ప్లాస్టిక్‌ కేఫ్‌ను గతేడాది జూన్‌ ముఫ్పైన ప్రారంభించారు. ఈ కేఫ్‌ను ఓం శాంతి అనే సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌నకు చెందిన రేఖా బెన్‌ నడిపిస్తోంది.

ఇది సోంపు, నిమ్మకాయ షర్బత్, ఇడ్లీ, పోహా, డోక్లా, మేథీ థోక్లా, గుజరాతీ థాళీలను అందిస్తోంది. వీటిలో ద్రవాహారం కావాలంటే అరకేజీ, ఆహార పదార్థాలు కావాలంటే కేజీ ప్లాస్టిక్‌ ఇస్తే సరిపోతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆకాంక్ష ఉన్న కస్టమర్లు ఈ కేఫ్‌కు ఎగబడి వస్తున్నారు. తరచు వచ్చే కస్టమర్లతో పాటు, పబ్లిక్‌ హాలిడేస్‌లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కేఫ్‌ లోనేగాక ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లలో సైతం కేఫ్‌ ఆర్డర్లు అందిస్తోంది. 

ప్లాస్టిక్‌ మనీతో...
ప్లాస్టిక్‌ను ఎన్నిసార్లు నిషేధించినప్పటికీ... ప్లాస్టిక్‌ వ్యర్థాలు తగ్గడం లేదు.  దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు రచిత్‌ రాజ్‌ టీమ్‌ ప్లాస్టిక్‌ మనీ కేఫ్‌ను ప్రారంభించింది. ప్లాస్టిక్‌ వాడకంపై ఆసక్తి తగ్గించి, ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిరోధించడం, రసాయన ఎరువులు వాడకుండా పండించిన ఆహారాన్నే ప్రజలకు అందించడం , సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపు మహిళలతో వీటిని నిర్వహించడమే లక్ష్యంతో ప్లాస్టిక్‌మనీతో ఈ కేఫ్‌ను నడిపిస్తున్నారు.  

ఆదాయం... ఆరోగ్యం....
డబ్బులకు బదులుగా తీసుకునే ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌కు పంపించి కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. సహజసిద్ధ ఎరువులతో పండించిన ఆహారం అందించి ఆరోగ్యం కాపాడుతూ, రసాయనాలు లేని పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల ద్వారా ఈ కేఫ్‌లను నడిపించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. కేఫ్‌లో ఆహార పదార్థాలను మట్టి పాత్రల్లో వడ్డిస్తూ ఇటు ప్రజల ఆరోగ్యంతో పాటు, అటు పర్యావరణాన్నీ పరిరక్షిస్తున్నారు. ఇలాంటి కేఫ్‌లు మరిన్ని ఏర్పాటైతే ప్లాస్టిక్‌ భూతాన్ని సులభంగా వదిలించుకోవచ్చు అంటున్నారు ఈ కేఫ్‌ను ప్రశంసిస్తున్నవారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement