ఢిల్లీ: తనపై దాడి జరిగిన సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దాడికి సంబంధిచి పలు విషయాలు పంచుకున్నారు.
‘‘ మే 13న సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ నాపై దాడి చేస్తున్నప్పుడు నేను అరుస్తునే ఉన్నారు. కానీ, నన్న రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాడి జరిగిన సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇంట్లోనే ఉన్నారు. ఈ దాడి విషయలో నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేను. నేను 9 గంటలకు సీఎం నివాసానికి వెళ్లితే డ్రాయింగ్ రూంలో నన్ను వేచి ఉండాలని ఇంటి సిబ్బంది తెలిపింది. కేజ్రీవాల్ ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. సీఎం నన్ను కలవడానికి వస్తారని సిబ్బంది చెప్పింది.
ఒక్కసారిగా బిభవ్ నేను ఉన్న గదిలోకి దూసుకువచ్చారు. ఏం అయింది? కేజ్రీవాల్ వస్తున్నారు. ఏం అయింది? అని ఆయన్ను అడిగాను. అంతలోనే ఆయన నాపై దాడి చేయటం మొదలు పెట్టాడు. ఏడెనిమిది సార్లు నా చెంప మీద కొట్టారు. నేను ఆయన్ను వెనక్కి నెట్టేయాలని ప్రయత్నం చేశాను. తన కాలుతో నన్ను లాగి మధ్యలో ఉన్న టెబుల్‌కు నా తలను బాదారు’’ అని స్వాతి మలివాల్ తెలిపారు.
‘‘బిభవ్ కుమార్ వేరే వాళ్ల సూచన మేరకే నాపై దాడి చేశారు. దాడి కేసులో నేను ఢిల్లీ పోలీసులకు సంపూర్ణంగా సహకరిస్తా. ఈ విషయంలో నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వను. నాపై దాడి జరుగుతున్న సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు. నేను బాధతో ఎంత అరిచినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నాపై జరిగిన దాడిలో విషయంలో నేను గళం ఎత్తుతాను.
దాని వల్ల నా కెరీర్‌కు ఇబ్బందైనా వదిలిపెట్టను. సత్యానికి, నిజమైన ఫిర్యాదులకు మద్దతుగా ఉండాలని చెప్పే నేను నా విషయంలో అంతే ధైర్యంగా ఉండి పోరాడుతాను’’ అని స్వాతి మలివాల్ అన్నారు. ఈ కేసులో అరెస్టైన బిభవ్ కుమార్ ఫోన్ ఫార్మాట్, సీఎం నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ దాడికి సంబంధించి స్వాతి మలివాల్ వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్ తీవ్ర విమర్శలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment