గంగూలీతో రిక్కీ పాంటింగ్ (PC: PTI)
టీమిండియా హెడ్‌కోచ్ పదవిపై తనకు ఆసక్తి లేదని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రిక్కీ పాంటింగ్ స్పష్టం చేశాడు. తాను ఈ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా లేనని తెలిపాడు.
ప్రధాన కోచ్‌గా ఉండాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి తనకు ఆఫర్ ఇచ్చిందని.. అయితే, తాను సున్నితంగా తిరస్కరించినట్లు పాంటింగ్ వెల్లడించాడు. కాగా టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగియనున్న విషయం తెలిసిందే.
వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాతే ద్రవిడ్ పదవీకాలం ముగియగా.. టీ20 ప్రపంచకప్-2024 ముగిసే వరకు జట్టుతో ఉండాలని బీసీసీఐ అతడిని కోరింది. ఇందుకు అంగీకరించిన ద్రవిడ్.. మెగా ఈవెంట్ తర్వాత తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.
ఈ క్రమంలో బీసీసీఐ ఇప్పటికే కొత్త హెడ్ కోచ్ కోసం వేట మొదలుపెట్టింది. ఇందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్‌తో పాటు జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తదితర విదేశీ కోచ్‌ల పేర్లు తెరమీదకు వచ్చాయి.
ఈ విషయంపై రిక్కీ పాంటింగ్ తాజాగా స్పందించాడు. ఐసీసీ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా హెడ్‌కోచ్ నియామకం గురించి చాలా వార్తలు చూస్తున్నా. నిజానికి మన కంటే ముందు మన గురించి సోషల్ మీడియా యూజర్లకే అన్ని వివరాలు తెలిసిపోతాయి(నవ్వుతూ)!
అది ఎలాగో మనకైతే అర్థం కాదు. నాక్కూడా జాతీయ జట్టుకు సీనియర్ కోచ్‌గా ఉండాలనే ఉంది. అయితే, అంతకంటే ఎక్కువగా నా కుటుంబంతో సమయం గడపాలని ఉంది.
టీమిండియా కోచ్‌గా ఉండాలంటే ఐపీఎల్ జట్లతో సంబంధాలు తెంచుకోవాలన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. హెడ్ కోచ్ అంటే ఏడాదిలో దాదాపు 10 -11 నెలల పాటు బిజీగా ఉంటాం.
నా ప్రస్తుత జీవనశైలి అందుకు ఏమాత్రం సరితూగదు. ఇప్పుడు నేను నా కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నా. ఐపీఎల్ సమయంలో చర్చలు జరిగిన మాట వాస్తవమే.
నాతో పాటు జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్.. గౌతం గంభీర్.. ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, నేను మాత్రం ప్రస్తుతం ఈ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేను’’ అని రిక్కీ పాంటింగ్ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేసిన రిక్కీ పాంటింగ్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment