రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్ (PC: BCCI)
ఐపీఎల్-2024లో చాంపియన్‌గా నిలవడానికి గల అర్హత ఇదేనంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ముందుకు సాగే జట్టే టైటిల్ సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు.
కాగా క్యాష్ రిచ్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు జరుగగా.. తొమ్మిదికి పైగా మ్యాచ్‌లలో.. ఒక ఇన్నింగ్స్‌లో 200.. అంతకంటే పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఇక ఈ సీజన్‌లో కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రోజుల వ్యవధిలోనే తమ రికార్డు తామే బద్దలు కొట్టింది.
దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్
తొలుత ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులు సాధించిన ఎస్‌ఆర్‌హెచ్.. ఆ తర్వాత ఆర్సీబీపై 287 పరుగులు స్కోరు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది.
Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅
— SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024
Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B
తగ్గేదేలే అంటున్న కేకేఆర్
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ సైతం ఢిల్లీ క్యాపిటల్స్‌పై 272 పరుగులతో సత్తా చాటింది. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్ వరుసగా 224, 223 పరుగులు స్కోరు చేశాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పటికే రెండుసార్లు భారీ స్కోరు చేసిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్ రికార్డులు సాధించింది. కేకేఆర్ కూడా మా జట్టు మీద 272 రన్స్ స్కోరు చేసింది.
సన్‌రైజర్స్ సూపర్ ఫామ్
నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగానే బ్యాటింగ్ జట్లకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతున్నట్లు అనిపిస్తోంది. ఆర్సీబీతో మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఎంతగా ప్రభావం చూపాడో చూశాం. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేగానీ ఆ మాదిరి షాట్లు ఆడలేరు. బ్యాటింగ్ ఆర్డర్‌లో డెప్త్ ఉన్న కారణంగా కూడా అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగాడు.
ఐపీఎల్ వంటి మేజర్ టోర్నీల్లో లేదా బిగ్ బాష్ లీగ్‌లో.. ఇలా ఎక్కడ చూసినా సరే లక్ష్యాన్ని కాపాడుకోగలిగి జట్లే విజయం సాధించాయి. అయితే.. ఈసారి ఐపీఎల్ మాత్రం భిన్నంగా సాగుతోంది.
ఆ జట్టుదే టైటిల్
బౌలర్లను చితక్కొడుతూ భారీ స్కోర్లు సాధించిన జట్లే టైటిల్ దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. డిఫెన్సివ్ బౌలింగ్‌పై ఆధారపడే జట్ల కంటే దూకుడుగా బ్యాటింగ్ చేసే జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
అలా అయితే ఈసారి సన్‌రైజర్స్‌దే టైటిల్!
ఇక పాంటింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే సీజన్ ఆరంభం(కేకేఆర్‌తో మ్యాచ్‌లో 204) నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సన్‌రైజర్స్‌కే టైటిల్ విన్నర్‌గా నిలిచే ఛాన్స్ ఉందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పాంటింగ్ మార్గదర్శనంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక పంత్ సేన తమ తదుపరి మ్యాచ్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌ను అహ్మదాబాద్‌లో ఢీకొట్టనుంది.
చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి..
Comments
Please login to add a commentAdd a comment