టీమిండియా కొత్త కోచ్ ఎవరన్న అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తొలుత విదేశీ కోచ్‌ల పేర్లు వినిపించగా.. ఐపీఎల్-2024 ఫైనల్ తర్వాత మాత్రం ఇండియన్‌నే ఈ పదవి చేపట్టనున్నాడనే అభిప్రాయాలు బలపడ్డాయి.
రాహుల్ ద్రవిడ్ స్థానంలో మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ ఈ బాధ్యతలు స్వీకరించనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఐపీఎల్ తాజా సీజన్ ఫైనల్ అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా గౌతీతో సుదీర్ఘ చర్చలు జరపడం.. గంభీర్ సైతం హెడ్‌కోచ్ పదవి పట్ల ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు ఇందుకు ఊతమిచ్చాయి.
అయితే, తాజాగా గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తాను భారత ప్రధాన కోచ్ పదవి చేపట్టడం లేదని గంభీర్ ఒక రకంగా స్పష్టం చేశాడు. ఇంతకీ గౌతీ ఏమన్నాడంటే..
‘‘కేకేఆర్ మూడో ట్రోఫీ గెలిచింది కాబట్టి.. డ్రెస్సింగ్‌రూం వాతావరణం మొత్తం సంతోషంతో నిండిపోయిందని మీరు అంటున్నారు. అయితే, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కంటే మేము ఇంకా రెండు టైటిళ్లు వెనుకబడి ఉన్నాం.
ఈ సీజన్ బాగా సాగింది. అయితే, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలవాలంటే మేమింకా మూడుసార్లు చాంపియన్లుగా నిలవాలి. అందుకు ఎంతో కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది.
కాబట్టి మా తదుపరి మిషన్.. అదే. కేకేఆర్‌ను మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా చేయగలగాలి. అంతకంటే గొప్ప అనుభూతి నాకు మరొకటి ఉండదు. అయితే, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది’’ అని స్పోర్ట్స్‌కీడా ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు.
ఈ వ్యాఖ్యలను బట్టి గంభీర్ కేకేఆర్‌తో తన ప్రయాణం కొనసాగిస్తాడని స్పష్టమవుతోంది. ఇక టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండాలంటే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, ఇతర జట్లతో సదరు వ్యక్తికి సంబంధం ఉండకూడదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్ మెంటార్‌గా కొనసాగేందుకే గంభీర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment