కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్‌.. పట్టుబట్టిన గంభీర్‌! | Last Chance For Kohli Rohit Gambhir Sets Condition For India Coach Job: Report | Sakshi
Sakshi News home page

కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్‌.. పట్టుబట్టిన గంభీర్‌!

Published Mon, Jun 24 2024 3:25 PM | Last Updated on Mon, Jun 24 2024 3:55 PM

Last Chance For Kohli Rohit Gambhir Sets Condition For India Coach Job: Report

టీమిండియా హెడ్‌కోచ్‌ ఎవరన్న అంశంపై ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ పేరు దాదాపుగా ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నా.. డబ్ల్యూవీ రామన్‌ కూడా రేసులో ఉన్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా కొనసాగిస్తూనే.. రామన్‌ సేవలను కూడా వినియోగించుకునే దిశగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. తాను హెడ్‌కోచ్‌ పదవి చేపట్టాలంటే గంభీర్‌ బీసీసీఐకి కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. నవ్‌భారత్‌ టైమ్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ ఎదుట ఎదుట ఇంటర్వ్యూకి హాజరైన సమయంలో తన ఐదు షరతులను వెల్లడించినట్లు సమాచారం. అవేమిటంటే..

తాను హెడ్‌కోచ్‌ పదవి చేపట్టినట్లయితే.. క్రికెటింగ్‌ ఆపరేషన్స్‌ విషయంలో బోర్డు ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు. ఆటకు సంబంధించిన ప్రతి విషయం తన ఆధీనంలోనే ఉండాలి.

అదే విధంగా.. సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ల సెలక్షన్‌ విషయం తనకే వదిలేయాలి.

ఇక మూడోది.. అత్యంత ముఖ్యమైనది.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ వంటి సీనియర్లకు పాకిస్తాన్‌ వేదికగా జరుగనున్న చాంపియన్స్‌ ట్రోఫీ-2025 అనేది చివరి అవకాశం.

ఒకవేళ ఈ వన్డే టోర్నీలో వీళ్లు గనుక విఫలమైతే జట్టు నుంచి వాళ్లందరిని తప్పించే వీలు కల్పించాలి. అయితే, ఇది కేవలం  ఈ ఒక్క ఫార్మాట్‌కే పరిమితమా? లేదంటే మూడు ఫార్మాట్ల జట్ల నుంచి వీరికి ఉద్వాసన పలకాలని గంభీర్‌ భావిస్తున్నాడా? అన్న అంశంపై స్పష్టత లేదు.

నాలుగో కండిషన్‌ ఏమిటంటే.. వన్డే, టీ20 ఫార్మాట్‌తో సంబంధం లేకుండా.. టెస్టు ఫార్మాట్‌కు ప్రత్యేక జట్టు ఉండాలి.

ఇక ఐదోది.. 2027 వన్డే ప్రపంచకప్‌ కోసం ఇప్పటి నుంచే తన  ప్రణాళికలను నిక్కచ్చిగా అమలు చేయడం.

ఈ నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లిలకు గడ్డు పరిస్థితులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంభీర్‌ వీరిని టెస్టు ఫార్మాట్‌కు మాత్రమే పరిమితం చేసే సూచనలు కనిపిస్తున్నాయని టీమిండియా అభిమానులు చర్చించుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement