Sakshi News home page

Cooking Oil: ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? వైద్యులు చెబుతున్నదిదే..

Published Thu, Mar 28 2024 6:07 PM

Which Is The Best Cooking Oil What Doctors Said - Sakshi

ఆయా ప్రాంతాల్లోని  వాతావరణాన్ని అనుసరించి ఆయా నూనెలు వాడటం జరుగుతుంది. మార్కెట్లో  సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్, ఆలివ్ ఆయిల్ వంటి రకరకాల ఆయిల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆహార పదార్థాల రుచి కూడా నూనెపైనే ఆధారపడి ఉంటుంది. కొవ్వు గురించి భయపడి చాలామంది ఆహరంలో తక్కువ నూనె వాడకానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. నలభై ఏళ్లు దాటినవారు ఆయిల్‌ ఫుడ్‌కు చాలా దూరంగా ఉంటారు. ఇంతకీ ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? రిఫైన్డ్‌ ఆయిల్స్‌ కంటే గానుగ నూనె బెటరా అంటే..

గానుగ నూనె చాలా పురాతన నూనె. ఎద్దులను ఉపయోగించి గానుగపట్టి నూనె గింజల నుంచి నూనె తీసే విధానం శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. కొన్నిదేశాల్లో గుర్రాలు, ఒంటెలను కూడా అందుకోసం ఉపయోగిస్తారు.గానుగలో తిప్పడం ద్వారా లభించే నూనెను 'కోల్డ్ ప్రెస్డ్' ఆయిల్ అంటారు. అంటే ఇక్కడ.. గానుగపట్టే సమయంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది.

నూనె గింజలను తక్కువ ఉష్ణోగ్రత వద్ద గానుగలో తిప్పడం వల్ల ఆ నూనెలో సహజ విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు వాటి అసలు రూపంలో ఉంటాయి. ఇవి నూనెను మరింత రుచికరంగా ఉంచుతాయి. ఆ కారణంగానే గానుగ నూనె శరీరానికి మేలు చేస్తుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. కానీ, ఈ నూనె తయారీకి ఖర్చు ఎక్కువ. ఎందుకంటే, విత్తనాల నుంచి 30 - 40 శాతం నూనె మాత్రమే వస్తుంది, అందువల్ల వ్యర్థాలు ఎక్కువ.

అయితే, ఎక్స్‌పెల్లర్ ప్రెస్డ్ ఆయిల్ మెషీన్ ద్వారా 80 నుంచి 90 శాతం నూనెను తీయవచ్చు. కానీ, మెషీన్ ద్వారా ఆయిల్ తీసే ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థాయిలు 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల నూనె సహజ స్వభావం మారుతుంది. ఆ తర్వాత వంట నూనె రిఫైనింగ్ (శుద్ధి) ప్రక్రియ జరుగుతుంది. మెత్తగా నూరిన విత్తనాల చూర్ణానికి హెక్సేన్ అనే రసాయనాన్ని కలుపుతారు. విత్తనాల నుంచి 100 శాతం నూనెను తీసేందుకు ఈ హెక్సేన్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాతి దశలో నూనెతో కలిపిన హెక్సేన్‌ను వేరుచేస్తారు.

అలా వచ్చిన నూనెను వివిధ రసాయనిక పద్ధతుల్లో రిఫైన్ చేస్తారు. చివరగా, నీళ్లలా శుద్ధంగా కనిపించే రుచీపచీ లేని నూనె వస్తుంది.గత కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్న సన్‌ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్స్ హెక్సేన్ ఉపయోగించి రిఫైన్ చేసే నూనెలే.

ఏది బెటర్‌ అంటే..
చివరిగా అన్ని రకాల నూనెల్లోనూ మంచి కొవ్వులు ఉంటాయి. అవి శరీరానికి అవసరం కూడా. అయితే మనం ఎంత నూనె తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. గుండె జబ్బులు, ఊబకాయం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలుంటే నూనె తీసుకోవాల్సిన పరిమాణంలో మార్పులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక నెయ్యితో పాటు ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకోవచ్చు.

వేయించడానికి రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనెను వాడొచ్చు. కొబ్బరినూనె, పామాయిల్ వంటి వాటిని కొద్దిమొత్తంలో తీసుకోవచ్చు. అందువల్ల ఒకటే నూనె కాకుండా, అన్ని నూనెలను నిర్దిష్ట మొత్తంలో తీసుకోవడం మంచిది. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తికి రోజుకు 15 మిల్లీలీటర్ల నూనె సరిపోతుంది. అంటే.. నెలకు సుమారు  450 నుంచి 500 మిల్లీలీటర్లు చాలు అని చెబుతున్నారు వైద్యులు. 

(చదవండి: మానవ మెదళ్లు పెద్దవి అవుతున్నాయ్‌! ఇక ఆ వ్యాధి..)

Advertisement

What’s your opinion

Advertisement