పిల్లలు పొద్దస్తమానం చదివితేనే అనేక విషయాలు తెలుస్తాయని, వారి పరిజ్ఞానం పెరుగుతుందని, వారు భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదుగుతారని సాధారణంగా తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే పిల్లల మెదడు మరింత చురుగ్గా పనిచేయాలన్నా, ఏకాగ్రతతో, క్రమశిక్షణతో మెలగాలన్నా వారికి తగినంత శారీరక శ్రమ తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల ఆలోచనా శక్తికి, బుర్రకు పదును పెట్టే కొన్ని ఆటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టెన్నిస్
పిల్లలు గానీ, పెద్దలు గానీ టెన్నిస్ ఆడితే అది శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. టెన్నిస్ ఆడినప్పుడు శరీరంలోని కండరాలన్నీ కదులుతాయి. శారీరక సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా చురుకైన కంటి చూపు, వేగంగా లక్ష్యాన్ని చేరుకోవడం లాంటి లక్షణాలు అలవాటవుతాయి. దీంతో చురుగ్గా నిర్ణయాలు తీసుకునే తత్వం ఏర్పడుతుంది. ఎదుటివారి ఆలోచనలను అంచనావేయడం, సమయస్ఫూర్తి వంటివి పెంపొందుతాయి.
బంతాట
బంతాట అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. అయితే వారికి ఊరికే ఏదో బాల్ ఇచ్చి ఆడుకోమని వదిలేయకుండా, ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో బాస్కెట్‌బాల్ రింగ్ తయారు చేసి, కొన్ని బంతులను వారికి ఇచ్చి, ఆడుకోమని చెప్పాలి. ఒక్కో బంతిని తీసి, ఆ రింగ్‌లో వేయమని వారికి సూచించాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లల్లో చేతికి, కళ్లకు మధ్య సమన్వయం మరింత మెరుగవుతుంది. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
సైక్లింగ్
సైక్లింగ్ చేసేప్పుడు పిల్లలు కింద పడకుండా ప్రయత్నించే క్రమంలో బ్యాలెన్సింగ్ నైపుణ్యాలను చక్కగా నేర్చుకుంటారు. పోటీతత్వం, ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను చేరుకోవడం వంటివి సైక్లింగ్ సాయంతో మరింతగా తెలుసుకుంటారు. సైక్లింగ్ శరీరానికీ మంచి వ్యాయామం అని నిపుణులు చెబుతుంటారు.
ఈత
చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలంటే వారికి స్విమ్మింగ్ నేర్పించాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్విమ్మింగ్ మెదడును ఏకాగ్రతగా ఉంచడంలో సహాయపడుతుంది. వేగంగా దూసుకెళ్లే తత్వాన్ని నేర్పిస్తూ, ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది.
కరాటే, కుంగ్ ఫూ
కరాటే, కుంగ్ ఫూ మొదలైనవి శారీరక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, వ్యక్తిగత క్రమశిక్షణ అలవడేలా చేస్తాయి. ఏకాగ్రత, అవతలివారిని గౌరవించడం, అవసరమైనప్పుడు తమని తాము కాపాడుకోవడం, పట్టుదల, మానసిక పరిపక్వత మొదలైన లక్షణాలెన్నో కరాటే, కుంగ్ ఫూ వలన అలవడుతాయి.
Comments
Please login to add a commentAdd a comment