జిల్లాలో ఎన్‌ఐఏ తనిఖీలు | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఎన్‌ఐఏ తనిఖీలు

Published Tue, Oct 3 2023 1:48 AM

- - Sakshi

పొన్నూరు/తాడేపల్లి రూరల్‌/మంగళగిరి: నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) అధికారులు సోమవారం జిల్లా వ్యాప్తంగా పౌరహక్కుల నేతల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పొన్నూరుకు చెందిన ప్రజావైద్యశాల డాక్టర్‌ టి.రాజారావు పౌరహక్కుల సంఘం రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నారు. సుమారు ఐదు గంటలపాటు రాజారావు నివాసంలో సోదాలు నిర్వహించారు. డాక్టర్‌ రాజారావు వద్ద లభించిన కరపత్రాలు, కమ్యూనిస్టు సంబంధిత పుస్తకాలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడులో నివాసముంటున్న ప్రగతిశీల సమైఖ్య సభ్యుడు బత్తుల రామయ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు.

అనంతరం డోలాస్‌నగర్‌లోని పలువురి నివాసాల్లో తనిఖీలు నిర్వహించి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మంగళగిరి నగర పరిధిలోని నవులూరు మక్కెవారిపేటలో నివాసం ఉంటున్న చైతన్య మహిళా సంఘం సభ్యురాలు సిప్పోరా నివాసంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఒక సెల్‌ఫోన్‌, విప్లవ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.

కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన దేవభక్త ప్రజాతంత్ర ఉద్యమ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమలపాకుల సుబ్బారావు నివాసంలో సోదాలు నిర్వహించారు. చివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వెనుదిరిగారు. డాక్టర్‌ రాజారావు విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులతో సంబంధాలు, రాజకీయ పార్టీలతో సంబంధాలపై ఆరా తీశారని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement