ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం: హైదరాబాద్‌ యువకుడు మృతి | A 30-year-old Indian man from Hyderabad lost his life on the battlefield during Russia Ukraine war. - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం: హైదరాబాద్‌ యువకుడు మృతి

Published Thu, Mar 7 2024 6:50 AM

- - Sakshi

పాతబస్తీకి చెందిన అఫ్సాన్‌ చనిపోయినట్టు ధ్రువీకరణ

రష్యాలోని భారత ఎంబసీ నుంచి సమాచారం

సాక్షి, సిటీబ్యూరో/ నాంపల్లి: ఉపాధి, అధిక వేతనం ఆశ.. ఏజెంట్ల మోసం కారణంగా పాతబస్తీకి చెందిన ఓ యువకుడు రష్యాలో మృత్యువాతపడ్డాడు. బజార్‌ఘాట్‌కు చెందిన మహ్మద్‌ అఫ్సాన్‌ ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లగా.. ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యాలోని పుతిన్‌ ప్రైవేట్‌ సైన్యంలో చేరాల్సి వచ్చింది. ఇతను ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొని అక్కడే అసువులు బాశాడు. ఈమేరకు రష్యాలోని భారతీయ రాయబారి కార్యాలయానికి సమాచారం అందింది. వారు బుధవారం అఫ్సాన్‌ సోదరుడు ఇమ్రాన్‌కు ఫోన్‌ చేసి ఈ విషయం తెలిపారు.

దీంతో బజార్‌ఘాట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా అఫ్సాన్‌ దీన స్థితిని వివరించి కాపాడాలని ఇక్కడి ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే తన సోదరుడు చనిపోయాడని ఇమ్రాన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. నారాయణ్‌పేట్‌కు చెందిన మహ్మద్‌ సుఫియాన్‌ అనే మరో యువకుడు ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకుపోయాడని, కనీసం అతడినైనా కాపాడాలని ఇమ్రాన్‌ విజ్ఞప్తి చేశాడు. ఆయన ఇక్కడ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ తన సోదరుడిని బాబా బ్లాక్స్‌ కంపెనీ ఉద్యోగంలోకి తీసుకుందని, ఆ సంస్థ దుబాయ్‌, ఢిల్లీ, ముంబైలో కార్యాలయాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

భారత్‌ నుంచి వెళ్లిన వారికి ఆర్మీ హెల్పర్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెప్పారని, చివరికి వారిని సైన్యంలోకి చేర్చి ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించినట్లు వివరించారు. కాగా అఫ్సాన్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలిసి వీరు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
Advertisement