రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా.. పరిస్థితిని గట్టెక్కించడానికి కీలక ఆలోచన చేస్తోంది. దేశంలోని స్థానిక ప్రభుత్వాలతో కలిసి లక్షల కొద్దీ అమ్ముడుపోని ఇళ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
ప్రాథమిక ప్రణాళికపై స్టేట్ కౌన్సిల్ పలు ప్రావిన్సులు, ప్రభుత్వ సంస్థల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది. రాష్ట్ర నిధుల సహాయంతో అదనపు హౌసింగ్ ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి చైనా ఇప్పటికే అనేక పైలట్ ప్రోగ్రామ్‌లతో ప్రయోగాలు చేసింది. అమ్ముడుపోని ఇళ్లను ప్రభుత్వాలు కొనుగోలు చేసే తాజా ప్రణాళికను అతిపెద్ద ప్రయత్నంగా భావిస్తున్నారు.
ప్రణాళికలో భాగంగా కష్టాల్లో ఉన్న డెవలపర్‌ల నుంచి అమ్ముడుపోని ఇళ్లను అమ్మించేందుకు ప్రభుత్వ సంస్థలు సహాయం చేస్తాయి. బ్యాంకుల రుణాల ద్వారా భారీ తగ్గింపులతో ఆ ఇళ్లను కొనుగోలుదారులకు అందిస్తాయి. ప్రణాళిక, దాని సాధ్యాసాధ్యాల వివరాలను అధికారులు ఇంకా చర్చిస్తున్నారు. చైనా ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయంపై ముందుకు వెళ్లాలనుకుంటే అది ఖరారు కావడానికి కొన్ని నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై చైనా గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించలేదు.
ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో చైనాలో గృహాల విక్రయాలు దాదాపు 47 శాతం క్షీణించాయి. అమ్ముడుపోని ఇళ్ల జాబితా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఈ రంగంలోని దాదాపు అర కోటి మంది నిరుద్యోగం బారినపడే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని తగ్గించడానికి కొత్త విధానాలను అన్వేషిస్తామని ఏప్రిల్ 30న పాలక కమ్యూనిస్ట్ పార్టీ హామీ ఇచ్చిన తర్వాత పెట్టుబడిదారులు ప్రభుత్వ తదుపరి కదలికల కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment