ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైరికల్‌ ట్వీట్‌ | Former Minister Harish Rao Tweet On Cm Revanth | Sakshi
Sakshi News home page

ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైరికల్‌ ట్వీట్‌

Published Wed, May 15 2024 3:01 PM | Last Updated on Wed, May 15 2024 4:27 PM

Former Minister Harish Rao Tweet On Cm Revanth

సాక్షి, హైదరాబాద్‌: కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

‘‘విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే బాధ్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించింది’’ అని హరీశ్‌ పేర్కొన్నారు.

‘‘రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్పకూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారు’’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.


‘‘తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం’’ అంటూ హరీశ్‌ వ్యాఖ్యానించారు.

‘‘సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్‌ హయాంలో రెప్ప పాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్‌ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిది. తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడతారని సీఎం భ్రమల్లో ఉన్నట్టున్నారు. వాటిని వీడి పాలన పై దృష్టి పెడితే మంచిది’’ అంటూ హరీశ్‌రావు హితవు పలికారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement