వీవీఎస్ లక్ష్మణ్- ద్రవిడ్ (PC: BCCI)
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ అత్యున్నత పదవి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగలవారు ఈనెల 27వ తేదీలోపు తమ దరఖాస్తులు పంపించాలి.
ఎంపికైన కొత్త హెడ్ కోచ్ పదవీకాలం మూడేన్నరేళ్లపాటు (1 జూలై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు) ఉంటుంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం గత ఏడాది నవంబర్‌లో వన్డే వరల్డ్‌కప్ అనంతరం ముగిసింది.
అయితే టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ముగిసేవరకు టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ పదవి కోసం ద్రవిడ్ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.
నో చెప్పిన ద్రవిడ్
అయితే, ఇందుకు ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరికొంత కాలం పాటు అతడిని కోచ్‌గా కొనసాగాలని టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో కొందరు అభ్యర్థించినట్లు సమాచారం. కనీసం టెస్టు జట్టుకైనా ద్రవిడ్ మార్గదర్శకుడిగా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
కానీ వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌ల నియామకంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం అని.. ఏదేమైనా ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందకపోవచ్చని జై షా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ సైతం హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
లక్ష్మణ్‌కు ఆ ఛాన్స్ లేదు
మరోవైపు.. ద్రవిడ్ గైర్హాజరీలో టీమిండియా కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే, బీసీసీఐ అతడిని అక్కడి నుంచి కదిలించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
ఫ్లెమింగ్ లేదంటే రిక్కీ పాంటింగ్?
ఈ నేపథ్యంలో.. ఈసారి విదేశీ కోచ్‌ను రంగంలోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్లు జై షా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా.. మరో పేరు కూడా తెర మీదకు వచ్చింది.
ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రిక్కీ పాంటింగ్ కూడా టీమిండియా హెడ్‌కోచ్ పదవి రేసులో ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు హెడ్‌కోచ్‌లుగా ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో కృషి చేయగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం) జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం పాంటింగ్‌కు ఉంది.
అది సాధ్యం కాదన్న పాంటింగ్
అయితే, వీళ్లిద్దరు కూడా టీమిండియా హెడ్‌కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే వరుస సిరీస్‌లతో బిజీగా ఉండే టీమిండియా కోసం కోచ్ ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు అంకితం కావాల్సి ఉంటుంది.
కాబట్టి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే వీలుండదు. అందుకే భారత జట్టు హెడ్‌కోచ్ పదవి ఆఫర్ వచ్చినా తాను చేపట్టలేదని రిక్కీ పాంటింగ్ గతం(2021)లో వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్‌గా ఎవరు వస్తారో? అంటూ క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.
చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment