Jasmin Paris: ఒకే ఒక్కరు! | Sakshi
Sakshi News home page

Jasmin Paris: ఒకే ఒక్కరు!

Published Sun, Mar 24 2024 6:01 AM

British ultrarunner Jasmin Paris became the first woman ever to finish the Barkley Marathons 100-mile race - Sakshi

చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ విజయకేతనం

100 మైళ్ల మారథాన్‌ రేసులో అరుదైన ఘనత సాధించిన జాస్మిన్‌ ప్యారిస్‌

100 మైళ్ల దూరం.. 60 గంటల వ్యవధి. మధ్యలో ఎవ్వరూ మనకు సాయపడరు. పరుగెత్తుతూనే ఉండాలి. ట్రెజర్‌ హంట్‌ తరహాలో అక్కడక్కడా ఉన్న పుస్తకాలను వెతికి పట్టుకుంటూ పరుగు ఆపకుండా గమ్యం దిశగా దూసుకెళ్లాల్సిందే. మారథాన్‌లో భాగంగా పార్క్‌ చుట్టూతా మొత్తంగా దాదాపు 60,000 అడుగుల ఎత్తును ఎక్కి దిగాలి. అలసటతో ఆగితే ఔటే ఇక. ధృఢ శరీరం మాత్రమే కాదు అంతకుమించిన మనో సంకల్పం తోడుంటేనే మారథాన్‌లో జయకేతనం ఎగరేయగలం.

ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన మారథాన్‌లలో ఒకటిగా పేరొందిన ప్రతిష్టాత్మక బాక్లీ మారథాన్స్‌లో పురుషులకు దీటుగా మొట్టమొదటిసారిగా ఒక అతివ ఈ రేసులో గెలిచి అబ్బురపరిచింది. అమెరికాలోని టెన్నిస్సీ రాష్ట్రంలోని ఫ్రెజెన్‌ హెడ్‌ స్టేట్‌ పార్క్‌ ఈ మారథాన్‌కు వేదికైంది. బ్రిటన్‌కు చెందిన జాస్మిన్‌ ప్యారిస్‌ అనే 40 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలు ఈ ఫీట్‌ సాధించి చరిత్రలో నిలిచిపోయారు.

55 మైళ్లుగా ఉన్న మారథాన్‌ను 1989 సంవత్సరంలో 100 మైళ్లకు పెంచాక ఇన్నేళ్లలో నిరీ్ణత గడువులోగా మారథాన్‌ను కేవలం 20 మంది మాత్రమే పూర్తిచేయగలిగారు. వీరిలో జాస్మిన్‌ ప్యారిస్‌ ఒక్కరే మహిళ కావడం విశేషం. మారథాన్‌ను 60 గంటల్లోపు పూర్తిచేయాల్సి ఉండగా ఇంకా 99 సెకన్లు ఉండగానే ఆమె విజయతీరాన్ని తాకారు. 59 గంటల 58 నిమిషాల 21 సెకన్లలో జాస్మిన్‌ ఈ రేసును శుక్రవారం పూర్తిచేశారు.

రాత్రంతా సరైన దారీతెన్నూ లేకున్నా ముళ్లు, పొదల గుండా పరుగెడుతూ ఫినిషింగ్‌ లైన్‌ను చేరుకున్న జాస్మిన్‌ను వేలాది మంది ఔత్సాహికులు తమ హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. ఈ సంవత్సరం 20 మంది బరిలో దిగగా జాస్మిన్‌తో కలిపి మొత్తంగా కేవలం ఐదుగురే మారథాన్‌ను పూర్తిచేయగలిగారు. ‘ ఈ రేసు ఉత్సాహం, ఆందోళనల కలబోత. దాదాపు అసాధ్యమైన రేసు అని తెలుసు. ఆ అసాధ్యమనే భావనే నన్ను ఈ రేసులో పరుగెత్తేలా చేసింది’ అని జాస్మిన్‌ అన్నారు.

అథ్లెట్‌ గాయాలపాలైనా మధ్యలో ఎవరూ ఎలాంటి సాయం చేయరు. ఫోన్లు ఉండవు, జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఉండదు. ఎలాంటి నావిగేషన్‌ వ్యవస్థలు ఉండవు. రెండు చోట్ల మాత్రం తాగు నీరు సదుపాయం ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జాస్మిన్‌ వృత్తిరీత్యా పశువైద్యురాలు.

బ్రిటన్‌లోని మిడ్లోటియన్‌లో ఉండే జాస్మిన్‌ వైద్యవృత్తిని కొనసాగిస్తూనే ఎడిన్‌బర్గ్‌లో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆఫ్రికన్‌–అమెరికన్‌ పౌరహక్కుల ఉద్యమకారుడు మారి్టన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ హత్యకేసులో దోషి అయిన జేమ్స్‌ ఎర్ల్‌ రే అనే ఖైదీ 1977 ఏడాదిలో అమెరికా జై లు నుంచి పారిపోతూ ఆగకుండా 12 మైళ్లు పరుగెత్తిన ఘటన నుంచి స్ఫూర్తి పొ ంది ఈ మారథాన్‌ను గ్యారీ క్యాంట్రెల్, కార్ల్‌ హెన్‌లు 1986లో ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement