ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరి మృతికి కారణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ.. రోజుకొక అరెస్ట్‌తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా టీనేజర్‌ను తప్పించేందుకు అతని కుటుంబం చేసిన ప్రయత్నాలు విస్తుగొల్పుతున్నాయి. తాజాగా ఈ కేసులో టీనేజర్ తల్లిని కూడా అరెస్ట్ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.
విచారణ కోసం పిలిచిన ఆమెను.. శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు పోలీసులు. బ్లడ్ టెస్ట్ సమయంలో నిందితుడి రక్త నమూనాలు బదులుగా తనవి ఇచ్చినందుకే ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ప్రమాదం సమయంలో తన కుమారుడు తాగలేదని నిరూపించేందుకు ఆమె తన రక్తనమూనాలు ఇచ్చినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన రోజు ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ తావ్‌డే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారని.. నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు భారీ నగదుతో డీల్ కుదిరిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ క్రమంలోనే టీనేజర్ తల్లి శాంపిళ్లను బ్లడ్ టెస్ట్‌కు ఇచ్చినట్లు తేలింది. రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత ఆమె ఆచూకీ లేకుండా పోయారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఒక వీడియో సందేశం విడుదల చేసిన ఆమె.. తన కుమారుడిని రక్షించాలంటూ కన్నీరుపెట్టుకోవడం గమనార్హం. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, శాంపిల్స్‌ను మార్చిన ఆరోపణలపై ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు.
పుణే పోర్షే కారు కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రి, తాత కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసును తనమీద వేసుకోమని తమ డ్రైవర్‌ను ఒప్పించేందుకు యత్నించారని, అతడు అంగీకరించకపోవడంతో కిడ్నాప్ చేసి ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు వారిద్దరి అరెస్టుకు కారణమయ్యాయి. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆ కుటుంబం పలువురు అధికారుల్ని ప్రలోభపెట్టేందుకు యత్నించడమూ దర్యాప్తులో వెలుగు చూసింది.
Comments
Please login to add a commentAdd a comment