ముంబై: మహారాష్ట్ర పుణె కారు ప్రమాదం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. ఘటనకు కారకుడైన టీనేజర్ తాత సురేంద్ర అగర్వాల్‌ను అత్యంత నాటకీయ పరిణామాల నడుమ పోలీసులు ఉదయం అరెస్ట్ చేశారు.
ఈ కేసులో విచారణ కోసం సురేంద్రను విచారణకు పిలిచారు పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. రాత్రి వరకు ప్రశ్నించారు. అయితే.. డ్రైవర్ గంగారాంను ఇరికించే ప్రయత్నం సురేంద్ర చేసిందేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. గంగారాంను బెదిరించి.. ప్రమాద సమయంలో కారు తానే నడిపినట్లు పోలీసుల వద్ద చెప్పాలని ఒత్తిడి చేసింది సురేంద్ర అని విచారణలో తేలింది. దీంతో.. కొత్త కేసు నమోదు చేసుకున్న పుణే క్రైమ్ బ్రాంచ్.. ఇవాళ వేకువ ఝామున 3గం. టైంలో సురేంద్రను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. కాగా, ఈ కేసులో ఇది మూడో ఎఫ్‌ఐఆర్.
ఓ టీనేజర్(17) ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మే 19వ తేదీన జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో కీలక నిందితుడైన మైనర్‌కు 15 గంటల్లోనే జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో పోలీసులు మరోసారి జువైనల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించి, ఆదేశాలను పునఃపరిశీంచాలని కోరారు. ఈ క్రమంలోనే బెయిల్ రద్దు చేసిన న్యాయస్థానం అతడిని వచ్చే నెల 5 వరకు అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని ఆదేశించింది.
ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లి మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బండిపై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితుడి తండ్రి, రెండు బార్‌ల యజమానులను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
అయితే ఈ కేసులో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాలపై ఇద్దరు అధికారులపైనా సస్పెన్షన్ వేటు పడింది. ప్రొటోకాల్ ప్రకారం ప్రమాదం విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాతే కేసును పుణె క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు. మరోవైపు రాజకీయంగానూ ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment