పూణే: పూణే పోర్షే కారు ప్రమాదం కేసులో ఇప్పటికే పలు సంచనాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో తాజాగా మరో ఆరోపణ తెరపైకి వచ్చింది. ఈ కారు ప్రమాదంలో నిందితులను తప్పించే అంశంలో ఓ ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం కూడా ఉందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత ఆరోపించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానా పటోలే తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పూణే పోర్షే కారు ప్రమాదంలో ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం కూడా ఉంది. ఆయనే తెర వెనుక చక్రం తిప్పారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. ఇదంతా సదరు ఎమ్మెల్యే ద్వారానే జరిగిందంటూ కామెంట్స్ చేశారు. ఇక, పబ్‌లో నిందితుడు మద్యం సేవిస్తున్నప్పుడు అతడిలో మరో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలను కూడా బయటకు వెల్లడించాలన్నారు. వారికి ఏదైనా పొలిటికల్ సపోర్టు ఉందా? అని ప్రశ్నించారు. ఇక, ఈ కేసు విషయంలో ప్రభుత్వ తీరును తీవ్ర తప్పుబడుతూ సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కూడా కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. పుణెలో కారు ప్రమాదంలో మరో విషయం బయటకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరో అంశాన్ని గుర్తించారు. ఈ కేసులో భాగంగా రూ.3 లక్షలకు కక్కుర్తిపడి వైద్యులే నిందితుడి రక్తం నమూనాలు మార్చేశారని గుర్తించారు. ఈ మొత్తాన్ని తెచ్చిన ఆసుపత్రి ప్యూన్‌ను అరెస్టు చేశారు.
అయితే, ప్రమాదం జరిగిన రోజు డాక్టర్ తావ్‌రే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి రక్తనమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్ కుదిరిందని పోలీసులు నిర్ధారించారు. నిందితుడైన బాలుడి రక్త నమూనాలకు బదులు వేరే నమూనాలను ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ మేరకు వారి డీల్ కుదిరింది. కాగా, వైద్య పరీక్షల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు బయటపడకూడదనే ఇలా చేశారని పోలీసులు తెలిపారు.
ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది..
కాగా, పటోలే వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆసిఫ్ భామ్లా స్పందించారు. ఈ సందర్భంగా భామ్లా మాట్లాడుతూ.. ఈ కేసులో వైద్యులు ఏదైనా అవకతవకలకు పాల్పడినా లేక ఏదైనా తప్పు జరిగినా ఎవరినీ విడిచిపెట్టేది లేదు. ఒక ఎమ్యేల్యే పోలీసు స్టేషన్‌కు వెళ్లినంత మాత్రాన ఏదో జరిగిపోయిందని ప్రతిపక్షాలు తప్పడు ప్రచారం చేస్తున్నాయి. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. ఎవరూ ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment