న్యూఢిల్లీ, సాక్షి: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. మరో చల్లని వార్త చెప్పింది. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది.
ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత జూన్ 5 నాటికి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపుర్, అస్సాం రాష్ట్రాలకు చేరుకుంటాయి. అయితే..
ఇదీ చదవండి: ఏపీలో పలుచోట్ల భారీ వర్షం
ఈసారి రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రెమాల్ తుపాను ఏర్పడింది. ఇది రుతుపవనాల గమనాన్ని బలంగా లాగిందని, అందుకే నిర్ణీత సమయానికంటే ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు.
వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నైరుతి రుతుపవనాలను పేర్కొంటారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కూడా జూన్ 5వ తేదీలోపే రుతుపవనాలు చేరతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈలోపు ప్రీ మాన్ సూన్ వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. అక్కడక్కడా వర్షాలు పడ్డప్పటికీ.. మరో మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఐఎండీ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment