అక్టోబర్‌ 7న అందుకే దాడులు: హమాస్‌ ప్రకటన | Hamas Group Admits To Faults During Oct 7 Attacks: Report - Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ ఏడున అందుకే దాడులు: హమాస్‌ ప్రకటన

Published Mon, Jan 22 2024 8:55 AM

Hamas Group Admits To Faults During Oct 7 Attacks - Sakshi

జెరూసలేం: హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దారితీసిన అంశంపై హమాస్‌ స్పందించింది. ఈ సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల నేపథ్యంలో తాము కాల్పులు జరిపినట్టు సమర్థించుకుంది. అలాగే, తమ భవిష్యత్‌ను నిర్ణయించుకునే హక్కు తమకు ఉందన్నారు. 

అయితే, అక్టోబర్ 7 నాటి దాడులను హమాస్ సమర్థించుకుంది. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ చేస్తోన్న కుట్రలను ఎదుర్కొనేందుకు దాన్ని అనివార్యమైన చర్యగా పేర్కొంది. అది సాధారణ ప్రతిస్పందనేనని తెలిపింది. ఈ మేరకు 16 పేజీల లేఖను విడుదల చేసింది. దీనిలో ఇజ్రాయెల్ భద్రత, సైనిక వ్యవస్థ వేగంగా కుప్పకూలిపోవడం, గాజా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడిన గందరగోళం కారణంగా కొన్ని లోపాలు సంభవించినట్లు వెల్లడించింది. హమాస్‌ ఈ విషయాలను ప్రస్తావించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

మరోవైపు.. గాజాపై ఇజ్రాయెల్ తన దురాక్రమణను, పాలస్తీనీయులపై నేరాలను, జాతి హననాన్ని తక్షణమే నిలిపివేయాలని హమాస్‌ డిమాండ్‌ చేసింది. గాజా యుద్ధానంతర భవిష్యత్తును నిర్ణయించడంపై అంతర్జాతీయ సమాజం, ఇజ్రాయెల్ ప్రయత్నాలను తిరస్కరించింది. ‘తమ భవిష్యత్‌ను నిర్ణయించుకునే, అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకునే సామర్థ్యం పాలస్తీనా ప్రజలకు ఉంది. ప్రపంచంలో ఎవరికీ వారి తరఫున నిర్ణయం తీసుకునే హక్కు లేదు’ అని స్పష్టం చేసింది. 

ఇదిలా ఉండగా.. అక్టోబర్‌ 7న హమాస్‌ ఉగ్రవాదుల మెరుపుదాడితో ఇజ్రాయెల్‌ ఉలిక్కిపడింది. ఆ ఘటనలో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై టెల్‌అవీవ్‌ భీకర దాడులతో విరుచుకుపడింది. ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకారం దాదాపు 9వేల మంది హమాస్‌ మిలిటెంట్లు హతమైనట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
 
Advertisement