గోదారి సీనుంటే.. బొమ్మ బ్లాక్‌బస్టరే.. | movies shooting spot in East Godavari | Sakshi
Sakshi News home page

గోదారి సీనుంటే.. బొమ్మ బ్లాక్‌బస్టరే..

Published Mon, Jun 10 2024 11:41 AM | Last Updated on Mon, Jun 10 2024 12:53 PM

 movies shooting spot in East Godavari

 సినీ చిత్రీకరణలకు నెలవైన గోదావరి

 వేగేశ్వరపురం ఒడ్డు హిట్టుకు తొలి మెట్టు మలకపల్లిలో భవనం 

 చిత్రసీమకు నందనం

 కుమారదేవంలో 150 ఏళ్ల సినిమా చెట్టు

  గోష్పాద క్షేత్రం సినీవర్గాల పుణ్యధామం

తాళ్లపూడి: వయ్యారి గోదారి పరవళ్లు.. ఒంపులు తిరిగిన గోదారి గట్లు.. ఆపైనుండే గుడి గోపురాలు.. నీటి మధ్య ఇసుక తిన్నెలు.. లంకలు.. సూర్యోదయాస్తమయ వేళల్లో గోదారమ్మ నుదుటిన అలదుకునే సిందూరం.. పావన నదిపై నీలి మేఘాలంకరణలు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నని చెప్పేది గోదారోళ్ల సౌభాగ్యం. భౌతిక నేత్రంతో చూసే భాగ్యం ఇక్కడివారిదైతే.. ఇవే దృశ్యాలను వెండితెరపై చూసి అచ్చెరువొంది.. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాలను సందర్శించాలని భావించేవారెందరెందరో.. 

కొంత కళాత్మక దృష్టి.. ఒకింత భావుకత.. మరికొంత రసరమ్యమైన మనసు.. వీటికి తోడు భావగర్భితమైన కెమెరా కన్ను.. చాలు.. ఓ సుందర దృశ్య కావ్యాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి. ఇలాంటి మనసున్న దర్శక, నిర్మాతలెందరో మన గోదావరిని అమ్మగా.. కొంటె కోణంగిగా.. వయ్యారిభామగా.. పడుచు పిల్లగా.. మరెన్నో విధాలుగా వెండి తెరపై ప్రపంచానికి చూపించి వారి జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన కథలకు నేపథ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాలను ఎన్నుకుని ఎనలేని కీర్తిని గడించారు. 

తెలుగు సంస్కృతికి ప్రతీకలు గోదావరి జిల్లాలు. ఇక్కడి ప్రజల వాడుక భాషే ‘చిత్ర’ భాషగా వ్యవహరిస్తారు. ఇక్కడి ఆచార వ్యవహారాలే ప్రామాణికంగా భావిస్తారు. దర్శక దిగ్గజాల్లో ఒకరైన నాటి ఆదుర్తి సుబ్బారావు నుంచి నేటి శేఖర్‌ కమ్ముల వరకూ ఎందరో గోదావరి అందాలతో వారి చిత్రాలను సుసంపస్నం చేసుకున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు వంటి అగ్ర దర్శకులే కాక.. ఈ ప్రాంతానికే చెందిన వంశీ తీసిన చాలా సినిమాలు గోదావరి నది నేపథ్యంగా సాగినవే. వారిలో చాలా మందికి పాపికొండల నుంచి అంతర్వేది వరకూ ఎన్నో ప్రాంతాల్లో కనీసం ఒక్క సన్నివేశమైనా చిత్రీకరిస్తే చాలు.. ఆ చిత్రం హిట్టు కొట్టేస్తుందనేది గట్టి నమ్మకం 

కొవ్వూరు పరిసరాల్లో.. 
ముఖ్యంగా కొవ్వూరు మండలంలోని గోష్పాద క్షేత్రం, కుమారదేవం, ఆరికిరేవుల, తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం పరిసర ప్రాంతాల్లో గోదావరి తీరాన తీసిన ప్రతి సినిమా సూపర్‌ హిట్టే. వేగేశ్వరపురంలో గోదావరి ఒడ్డున ఉన్న ఆంజనేయుని ఆలయం రేవు, బల్లిపాడు ఇసుక ర్యాంపు లంకలు, మలకపల్లిలోని కుంటముక్కల వారి గృహంలో అనేక సినిమాల్లో చాలా సన్నివేశాలే చిత్రీకరించారు. 

👉వేగేశ్వరపురంలో చిరంజీవి నటించిన రక్తసింధూరంలోని ఓ పాటను, రామ్‌చరణ్, సమంత నటించిన రంగస్థలంలోని పలు సన్నివేశాలను తాడిపూడి, వేగేశ్వరపురం గోదావరి లంకల్లో చిత్రీకరించారు. 

👉 నాని హీరోగా నటించిన శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తాళ్లపూడిలోనే తీశారు. 

👉 సాయికుమార్, ఆయన కుమారుడు ఆది కథా నాయకుడిగా నటించిన చుట్టాలబ్బాయ్‌ చిత్రంతో పాటు, మంచు మనోజ్, రెజీనా నటించిన శౌర్య చిత్రంలో పలు కీలక సన్నివేశాలను ఇక్కడే తెరకెక్కించారు. 

👉 నాగార్జున, అనుష్క నటించిన ఢమరుకం చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను గోదావరి నది ఒడ్డున ఆంజనేయస్వామి గుడి వద్ద తీశారు. ప్రత్యేకంగా రుషుల కోసం ఒక సెట్‌ వేసి వారం రోజుల పాటు ఇక్కడ షూటింగ్‌ చేశారు. 

👉 సుమంత్‌ నటించగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి, వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్‌ నటించిన సరదాగా కాసేపు చిత్రంలో కారులో వెళ్లే పాటను ఇక్కడే చిత్రీకరించారు. 

👉 జగపతిబాబు, ప్రియమణి నటించిన పెళ్‌లైన కొత్తలో చిత్రంలో వారి స్నానపు సన్నివేశాన్ని ఇక్కడే తెరకెక్కించారు. 

👉  ప్రక్కిలంకలో కృష్ణ నటించిన పాడిపంటలుతో పాటు, చంద్రమోహన్‌ నటించిన సిరిసిరిమువ్వ ఈ ప్రాంతంలో చిత్రీకరించినవే. 

👉 శ్రీకాంత్, చార్మి నటించిన చిత్రంలోని ఓ పాటను, శివాజీ హీరోగా నటించిన మిస్టర్‌ ఎర్రబాబులో మిత్రులతో కలిసి కథానాయికను ఆయన పరిచయం చేసుకునే సన్నివేశాన్ని, సునీల్‌పై హాస్య సన్నివేశాలను, ఆలీ నటించిన ఆషాఢం పెళ్లికొడుకులో ఒక పాటను ఇక్కడి ఇసుక తిన్నెల్లో ప్రత్యేకంగా సెట్‌ వేసి చిత్రీకరించారు. 

👉 కేవలం సినిమాలే కాకుండా కొన్ని ధారావాహికలు సైతం ఇక్కడి గోదారి ప్రాంతాల్లో చిత్రీకరించారు. 

హిట్‌ చిత్రాల భవనం 
సుమారు 110 ఏళ్ల క్రితం మలకపల్లిలో ఆ గ్రామానికి చెందిన కుంటముక్కల వీరభద్రరావు, వెంకటాద్రి, జానకిరామయ్య లోగిలిని అత్యాధునికంగా నిర్మించారు. ఈ గృహంలో సినిమా తీస్తే హిట్‌ గ్యారెంటీ అని చిత్రరంగ ప్రముఖుల్లో గట్టి నమ్మకం. 

👉 జంధ్యాల దర్శకత్వంలో 1985లో వచ్చిన సీతారామకల్యాణం చిత్రం ఎక్కువ భాగం ఈ ఇంట్లోనే తీశారు.
 
👉  ఆ చిత్రం విజయం సాధించడంతో సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో డి.సురే‹Ùబాబు నిర్మాతగా బి.గోపాల్‌ దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా నటించిన బొబ్బిలిరాజా చిత్రంలోని కీలక సన్నివేశాలను కూడా ఈ ఇంట్లోనే తెరకెక్కించారు. 

👉    అలాగే క్రాంతికుమార్‌ దర్శకత్వంలో వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, బాలకృష్ణ నటించిన సీతారామ కల్యాణం, నరేష్‌ నటించిన ప్రేమచిత్రం.. పెళ్లి విచిత్రం, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శోభన్‌బాబు నటించిన ఏవండీ ఆవిడ వచ్చింది, ఇంకా.. సీతారత్నం గారి అబ్బాయి, తాళి తదితర చిత్రాలన్నీ విజయం సాధించాయి. 

👉 ఇదే గ్రామంలో దివంగత  కుంటముక్కల భాస్కరరావు గృహానికి 140 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రేమవిజేత అనే చిత్రం, రజనీకాంత్‌ నటించిన తమిళ సినిమా, జగదాంబ టూరింగ్‌ టాకీస్‌ తదితర సినిమాల్లో చాలా సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. అప్పట్లో డి.రామానాయుడు ఇక్కడి గ్రంథాలయానికి రూ.30 వేల విరాళం అందజేశారు. దీంతో గ్రామస్తులు ఆ భవనానికి మరమ్మతులు చేసి, రామానాయుడు గ్రంథాలయంగా పేరు పెట్టారు. రామచరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తాజాగా నిర్మిస్తున్న గేమ్‌ చేంజర్‌ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు.

150 ఏళ్ల నాటి సినిమా చెట్టు
కుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున ఉన్న నిద్రగన్నేరు చెట్టుకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ సుమారు 200 పైగా సినిమాల షూటింగ్‌లు జరిగాయి. దీంతో, దీనికి ‘సినిమా చెట్టు’గా పేరొచ్చింది. ఇక్కడ సినిమా తీస్తే తప్పకుండా హిట్‌ అవుతుందన్న సెంటిమెంట్‌ చిత్రసీమలో స్థిరపడిపోయింది. ఈ నమ్మకంతోనే ఒక్క సీన్‌ అయినా ఈ చెట్టు కింద తీస్తారు. మొదటిగా కృష్ణ హీరోగా 1975లో పాడిపంటలు ఈ చెట్టు వద్ద చిత్రీకరించారు. ఏఎన్‌ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, శోభన్‌బాబు, బాలకృష్ణ, మోహన్‌బాబు, సుమన్, మహే‹Ùబాబు, రామ్‌చరణ్, రాజశేఖర్, నాని తదితర హీరోలతో పాటు, దర్శకులు వంశీ, రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, సుకుమార్‌ ఈ చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడం సెంటిమెంట్‌గా భావిస్తారు.

షూటింగ్‌ల అడ్డా.. గోష్పాద క్షేత్రం 
కొవ్వూరు గోష్పాద క్షేత్రం పలు హిట్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. జూనియర్‌ ఎనీ్టఆర్, భూమిక నటించిన హిట్‌ చిత్రం సింహాద్రిలో ఇంటర్వెల్‌ సీన్‌ ఇక్కడే తీశారు. అలాగే సుకుమార్‌ దర్శకత్వంలో 100 పర్సంట్‌ లవ్‌తో పాటు గుండెల్లో గోదారి, బెండు అప్పారావు ఆర్‌ఎంపీ తదితర అనేక చిత్రాలు ఇక్కడ తీశారు. ఇలా గోదావరి తీరంలో ఏటా చాలా చిత్రాల షూటింగులు జరుగుతూనే ఉంటాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement