వాదం.. ఎవరికి ఆమోదం! సీడ్‌ మాఫియాతో చీకటి ఒప్పందం.. | Sakshi
Sakshi News home page

వాదం.. ఎవరికి ఆమోదం! సీడ్‌ మాఫియాతో చీకటి ఒప్పందం..

Published Tue, Nov 14 2023 1:42 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల పర్వం ముగియడంతో పాలమూరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఎవరికి వారు వ్యూహాత్మకంగా అడుగులేస్తుండడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 14 నియోజకవర్గ స్థానాలు ఉండగా.. ఎక్కడా లేని విధంగా గద్వాలలో తెరపైకి వచ్చిన బహుజన వాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

70 ఏళ్ల చరిత్రలో ఈసారి ఎన్నికల్లో డీకే అరుణ కుటుంబం పోటీకి దూరంగా ఉండగా.. అధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీతో పాటు ఏఐఎఫ్‌బీ పార్టీలు నువ్వా.. నేనా అన్నట్లు పోటాపోటీగా ఎన్నికల పోరులో దూసుకెళ్తున్నాయి. సోషల్‌ మీడియాను సైతం ఆయా పార్టీల అభ్యర్థులు విస్తృతంగా వినియోగించుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎవరికి వారు తమకు అనుకూల పోస్టులతో హల్‌చల్‌ చేస్తుండగా.. హస్తం అభ్యర్థి స్థానికత హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు.. గద్వాలో కాంగ్రెస్‌కు ప్రధానంగా ఊపిరిపోసిన బహుజనవాదం.. అభ్యర్థి, ముఖ్య నేతల వ్యవహార శైలి, కాలక్రమంలో మారుతున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి గుదిబండగా మారినట్లు తెలుస్తోంది.

సీడ్‌ మాఫియాతో చీకటి ఒప్పందం..
నడిగడ్డ రాజకీయాల్లో సీడ్‌ మాఫియాది ప్రత్యేక స్థానం. ఆర్గనైజర్లు, సబ్‌ ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తున్న వారు ఏళ్లకేళ్లుగా తమకు అనుకూలమైన అభ్యర్థులకు వంతపాడడమే కాకుండా.. వారికి ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తున్నట్లు ఇదివరకే ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా సీడ్‌, రియల్‌, మట్టి తదితర మాఫియాను పారదోలుతామని స్థానిక కాంగ్రెస్‌ నేతలు పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ముందు ప్రచారం చేశారు.

అయితే అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి జెడ్పీచైర్‌పర్సన్‌ సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరగా.. ఆమెనే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాల క్రమంలో సీడ్‌ మాఫియా నేతలతో వారు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడం చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. సబ్‌ ఆర్గనైజర్లతో అంటకాగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ మారగా.. నడిగడ్డ రైతుల్లో కాకరేపుతోంది.

మైనస్‌గా మారుతోందా?
కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచారం తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లక్ష్యంగానే కొనసాగుతున్నట్లు గద్వాల పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. పార్టీలో అనేక ఏళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని కాకుండా తన సామాజిక వర్గానికి చెందిన నాయకులకే బాధ్యతలు అప్పగించడం మైనస్‌గా మారు తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కే చెందినప్పటికీ తాము ఓటర్లం కాదన్నట్లు వ్యవహరిస్తుండడం మల్దకల్‌తో పాటు పలు మండలాలకు చెందిన కుటుంబాలు మథనపడు తుండగా.. జనంలో బహుజన వాదం.. ఎవరికి ఆమోదమనే చర్చ జోరుగా సాగుతోంది.

ఏఐఎఫ్‌బీ పదునైన విమర్శలు..!
ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ గొంగళ్ల రంజిత్‌కుమార్‌ వర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిపై పదునైన ఆరోపణస్త్రాలు సంధిస్తున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా సరిత నాలుగేళ్ల పాటు అధికార పార్టీలో ఉంటూ ఏ ఒక్క రోజు కూడా బహుజనుల కోసం భుజం కాసింది లేదని.. ఎందరో బలైనా వారి తరఫున కనీసం ప్రశ్నించిన దాఖల లేవని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నాలుగేళ్ల పాటు అధికార పార్టీలో అధికారాన్ని అనుభవించి కేవలం అధికారం కోసం జిమ్మక్కులు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు.

సీడ్‌ మాఫియా, రెడ్లతో మిలాఖత్‌ అయ్యి గద్వాలలో బహుజనవాదాన్ని సమాధి చేయడానికే పోటీ చేస్తున్నారనే ఘాటైన విమర్శనాస్త్రాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడం మెజార్టీ బహుజన వాదుల్లో తీవ్ర చర్చకు దారితీయగా.. కాంగ్రెస్‌కు ఇరకాటం తెచ్చిపెట్టినట్లయింది. కాంగ్రెస్‌లో అభ్యర్థి ప్రకటన సమయంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు టికెట్‌ కొనుక్కున్న నాయకురాలు ప్రజాసేవ చేయగలదా.. గద్వాలలో బహుజనవాదాన్ని సమాధి చేయడానికే ఆమె వచ్చిందంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల తొలి ఘట్టం ముగిసిన క్రమంలో సోషల్‌ మీడియాలో ఫొటోలు, పేర్లతో సహా కాంగ్రెస్‌ అభ్యర్థిపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
ఇవి కూడా చదవండి: ఆయనకు ఓటమి కనిపిస్తోంది..! : పువ్వాడ అజయ్‌కుమార్‌

Advertisement
Advertisement