టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ మారబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. కొత్త కోచ్‌గా భారతీయ క్రికెటర్ లేదంటే విదేశీ ఆటగాడైనా రావొచ్చని సంకేతాలు ఇచ్చాడు.
కాగా పొట్టి వరల్డ్‌కప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి మార్గదర్శనంలో అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది.
టైటిల్ పోరులో రాణించలేక
టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23, వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీల్లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవకలేకపోయింది. ఆఖరి మెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో బోల్తాపడి ట్రోఫీని చేజార్చుకుంది.
ఇదిలా ఉంటే.. వాస్తవానికి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 పూర్తయ్యేనాటికి రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తైంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్ వరకు ద్రవిడ్‌ను కోచ్‌గా కొనసాగాల్సిందిగా బోర్డు కోరడంతో అతడు సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి.
ద్రవిడ్ గుడ్‌బై/ ద్రవిడ్‌కు గుడ్‌బై?
అయితే, తాజా సమాచారం ప్రకారం ద్రవిడ్ తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనుంది.
ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘రాహుల్ పదవీ కాలం జూన్ వరకు పూర్తవుతుంది. ఒకవేళ అతడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే.. అప్లై చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అతడికి ఉంది.
కొత్త కోచ్‌గా ఫారినర్?
ఇక కొత్త కోచ్ ఇండియన్ లేదంటే ఫారినర్ అన్న విషయం గురించి ఇప్పుడే చెప్పలేం. క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయానుసారమే కోచ్ నియామకం జరుగుతుంది’’ అని జై షా క్రిక్‌బజ్‌తో వ్యాఖ్యానించాడు.
అలాంటిదేమీ లేదు!
అదే విధంగా.. భిన్న ఫార్మాట్లకు భిన్న కోచ్‌ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఈ విషయంలో కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్.. ఇలా చాలా మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. కానీ కోచ్‌ల విషయంలో అలా జరిగే ఆస్కారం లేదు’’ అంటూ కొట్టిపారేశాడు.
చదవండి: రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అయ్యర్ కెప్టెన్సీలో!
Comments
Please login to add a commentAdd a comment