డిజిటల్‌ ఇండియా విజన్‌కు సహకరిస్తాం | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ఇండియా విజన్‌కు సహకరిస్తాం

Published Fri, Jan 6 2023 5:47 AM

Microsoft CEO Satya Nadella Meets PM Narendra Modi, Pledges Support To Digital India Vision - Sakshi

న్యూఢిల్లీ: ‘డిజిటల్‌ ఇండియా విజన్‌’ సాకారం కావడానికి తమ వంతు సహకారం అందిస్తామని మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ప్రధాని మోదీతో తన భేటీ చక్కగా జరిగిందని సత్య నాదెళ్ల వెల్లడించారు. డిజిటల్‌ ఇండియా విజన్‌ మొత్తం ప్రపంచానికి వెలుగును చూపుతుందని ఉద్ఘాటించారు. తర్వాత మోదీ ట్వీట్‌ చేశారు. దేశ యువత నూతన ఆలోచనలు భూగోళాన్ని ప్రభావితం చేయగలవని వివరించారు.  

డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు  
బెంగళూరు: భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని  నాదెళ్ల తెలిపారు. తమ దారిలోనే ఇతర కంపెనీలు సైతం నడుస్తాయని, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ‘ఫ్యూచర్‌ రెడీ టెక్నాలజీ సదస్సు’లో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. అనంతరం మీడియాతో భారతదేశ టెక్నాలజీ స్టోరీ విస్తరించడానికి సహకరిస్తామని వ్యాఖ్యానించారు. టెక్నాలజీలో భారత్‌ అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు. ఇది రాయాల్సిన, మాట్లాడుకోవాల్సిన చరిత్ర అని చెప్పారు.

బిర్యానీ.. సౌతిండియా ‘టిఫిన్‌’ కాదు: సత్య నాదెళ్ల
ఆధునిక కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే చాట్‌ రోబో ‘చాట్‌జీపీటీ’లో తనకు ఎదురైన అనుభవాన్ని సత్య నాదెళ్ల వివరించారు. దక్షిణ భారతదేశంలో బాగా పేరున్న టిఫిన్ల గురించి తాను అడగ్గా.. ఇడ్లి, దోశ, వడతోపాటు బిర్యానీ అంటూ చాట్‌జీపీటీ బదులిచ్చిందని అన్నారు. తాను హైదరాబాదీనని, తన పరిజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దని, బిర్యానీ అనేది టిఫిన్‌ కాదను తాను గట్టిగా చెప్పడంతో చాట్‌జీపీటీ క్షమాపణ కోరిందని వెల్లడించారు.  

 
Advertisement
 
Advertisement