బెయిల్‌ ఇస్తే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు | Sakshi
Sakshi News home page

బెయిల్‌ ఇస్తే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు

Published Wed, May 8 2024 3:23 AM

No interim bail yet for Delhi CM Arvind Kejriwal in excise policy case

ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వర్తించవద్దు  

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ  

మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన ధర్మాసనం  

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయాలని భావించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆశ నెరవేరలేదు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టై ప్రస్తుతం తిహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ లభించలేదు. తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది.

తొలుత కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ అభిషేక్‌ సింఘ్వీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ కోరడం సరైంది కాదని మెహతా వాదించారు. ‘‘ఇలాంటి వాటికి కూడా బెయిల్‌ ఇస్తే రాజకీయ నాయకులను ప్రత్యేక తరగతిగా పరిగణించినట్లు అవుతుంది. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఓ రైతు తనకు పంట కోతలున్నాయంటూ మధ్యంతర బెయిల్‌ కోరవచ్చు. అందుకే రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండొద్దు.

నిందితుడు సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వొద్దు’’ అని సుప్రీంకోర్టును కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ఒక పార్టీ అధినేతగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం కేజ్రీవాల్‌కు ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘ఇది నిజంగా అసాధారణ పరిస్థితి. కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. ఐదేళ్లకోసారి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసే అవసరం ఆయనకు ఉంది. ఈ కేసులో ఒకవేళ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేము అనుమతించం.

అలా చేయడం విరుద్ధ ప్రయోజనాలకు దారి తీస్తుంది. అందుకే బెయిల్‌పై విడుదలైతే అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు’’ అని స్పష్టం చేసింది. అభిషేక్‌ సింఘ్వీ స్పందిస్తూ కేజ్రీవాల్‌ బెయిల్‌పై బయటకు వెళ్లినా ఎలాంటి ఫైళ్లపై, పత్రాలపై సంతకాలు చేయబోరని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది. బుధవారం లేదా గురువారం లేదా శుక్రవారం.. ఎప్పుడైనా సరే దీనిపై తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. మరోవైపు మనీ లాండరింగ్‌ కేసులో తనను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై కూడా ధర్మాసనం విచారణ జరిపింది. దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు, కేజ్రీవాల్‌ అరెస్టుకు ముందునాటి ఫైళ్లను అధికారులు కోర్టుకు సమర్పించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement