Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్‌ పాండ్యా పోస్ట్‌ వైరల్‌ | Hardik Pandya Shares First Post After Divorce Rumours With Wife Natasa Stankovic Viral | Sakshi
Sakshi News home page

Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్‌ పాండ్యా పోస్ట్‌ వైరల్‌

Published Wed, May 29 2024 5:08 PM | Last Updated on Wed, May 29 2024 6:07 PM

Hardik Pandya Shares Post Amid Divorce Rumours With Wife Natasa Stankovic Viral

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా జట్టుతో చేరాడు. టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ కోసం సహచర ఆటగాళ్లతో కలిసి అమెరికాలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. కాగా ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఐపీఎల్‌-2024 సీజన్‌లో పగ్గాలు చేపట్టిన పాండ్యాకు ఏదీ కలిసి రాలేదు. రోహిత్‌ శర్మపై మేనేజ్‌మెంట్‌ వేటు వేసి అతడి స్థానంలో పాండ్యాను తీసుకువచ్చినందుకు సొంత జట్టు అభిమానులే జీర్ణించుకోలేకపోయారు.

అడుగడుగునా హార్దిక్‌ పాండ్యా, ముంబై యాజమాన్యాన్ని ట్రోల్‌ చేస్తూ ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా చెత్త కెప్టెన్సీతో విమర్శలు మూటగట్టుకున్నాడు. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్‌.. పదో స్థానంతో ఈ సీజన్‌ను ముగించింది.

ఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్‌ పాండ్యా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అతడి భార్య నటాషా స్టాంకోవిక్‌తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2024 ముగియగానే హార్దిక్‌ పాండ్యా ఒంటరిగానే లండన్‌కు వెళ్లి సెలవులను గడిపినట్లు సమాచారం. అనంతరం.. అమెరికాకు వచ్చిన టీమిండియాతో అతడు చేరినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌ షురూ చేసిన వీడియోను బీసీసీఐ షేర్‌ చేసింది. ఇందులో హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘మెగా టోర్నీ కోసం న్యూయార్క్‌లో రావడం ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఎండ కూడా బాగా కాస్తోంది’’ అని హార్దిక్‌ పాండ్యా చెప్పుకొచ్చాడు.

అదే విధంగా.. ‘‘జాతీయ జట్టు తరఫున విధుల్లో ఇలా’’ అంటూ తన ఫొటోలను హార్దిక్‌ పాండ్యా ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.  నటాషాతో విడాకుల ప్రచారం ఊపందుకున్న తర్వాత ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ తొలిసారిగా ఇలా తన ఒక్కడి ఫొటోలు షేర్‌ చేయడం విశేషం.

చదవండి: T20 WC: ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement