పేద విద్యార్ధులకు సాయం చేసేందుకు నేను సిద్ధం: బాపయ్య చౌదరి
పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నాట్స్ అధ్యక్షుడికి సన్మానం
పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో నాట్స్ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా నిర్వహించిన సభకు లక్ష్మణ్ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పెదనందిపాడులో పలుమార్లు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి వందలాది మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయించడం నిజంగా చాలా గొప్ప విషయమన్నారు.
జన్మభూమి రుణం తీర్చుకోవాలనే తపనతో పని చేస్తున్న నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతిని లక్ష్మణరావు అభినందించారు. అమెరికాలో ఉంటున్న బాపు నూతి తన స్వగ్రామమైన పెదనందిపాడులో చేస్తున్న సేవా కార్యక్రమాలు నేటి యువతలో సేవా భావాన్ని, దేశభక్తిని పెంపొందించడానికి తోడ్పడతాయని అన్నారు. నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని లక్ష్మణరావు అన్నారు. రెండు రాష్ట్రాల్లో కుట్టు మిషన్ శిక్షణ శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు ,ప్రభుత్వ పాఠశాలలకు సైకిల్ స్టాండు నిర్మాణం,మెడికల్ క్యాంపులు నిర్వహించడం, గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ అందజేయడం వంటి కార్యక్రమాలపై లక్ష్మణరావు ప్రశంసల వర్షం కురిపించారు.
వైద్యం పొందడానికి పేదరికం అనేది శాపం కాకూడదనేది నాట్స్ లక్ష్యమని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి అన్నారు. గత కొన్నేళ్లుగా నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెదనందిపాడులో వందలాది మందికి ఉచిత కంటి పరీక్షలు చేయించడంతో పాటు.. అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించామని తెలిపారు. నల్లమల అడవి ప్రాంతంలో మహిళా సాధికారత కోసం గిరిజన మహిళలకు కుట్టుశిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పేద ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి, ఆనందం మరే దానిలో తనకు లభించలేదని బాపు నూతి అన్నారు.
ఈ సభకు కాకుమాను నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. మెగా కంటి వైద్య శిబిరాలు పేద ప్రజలు చక్కగా వినియోగించుకున్నారని ఆల్ ఇండియా లాయర్ యూనియన్ రాష్ట్ర నాయకులు నర్రా శ్రీనివాసరావు అన్నారు. ప్రాంగణంలో కంటి వైద్య శిబిరాన్ని శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, మాజీ ఎంపీపీ మర్ర బాలకృష్ణ ,ముద్దన నాగరాజుకుమారి ,పారిశ్రామిక వేత్తలు దాసరి శేషగిరిరావు, అరవపల్లి కృష్ణమూర్తి ,ముద్దన రాఘవయ్య, శీలం అంకారావు ,కొల్లా సాంబశివరావు తదితరులు బాపయ్య చౌదరి చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం నూతి బాపయ్య చౌదరి ,ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, నర్రా శ్రీనివాస్‌లను రైతు సంఘాల ప్రతినిధులు శాలువాతో సత్కరించారు.
ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో 620 మంది పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 374 మంది ఆపరేషన్లు అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం నిర్వహణ కమిటీ సభ్యులు దాసరి సుబ్బారావు, దాసరి రమేష్ ,ఎస్ చౌదరి ,లావు శివప్రసాద్ ,పి.పోతురాజు,కాకుమాను చెన్నకేశవులు ,కే శ్రీనివాసరావు,పి. గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. నాట్స్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పేద విద్యార్ధులకు సాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటానని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని బాపు నూతి సందర్శించారు..ఎంతో మంది పేద రైతులు పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఏర్పాటుకు సహకరించారని బాపు నూతి అన్నారు. ఈ కాలేజీలో చదువుకున్న వారు అనేక రంగాల్లో మంచి విజయాలు సాధించారని.. అందులో తాను కూడా ఉన్నానని అన్నారు.
పెదనందిపాడు అభివృద్ధికి తాను వంతు చేయూత అందించేందుకు ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. పేద విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇచ్చి వారిని ప్రోత్సాహిస్తున్నామని బాపు నూతి తెలిపారు. అమెరికాలో తెలుగువారికి నాట్స్ కొండంత అండగా నిలుస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. దివ్యాంగుల స్వశక్తితో నిలబడేలా వారికి చేయూత అందించే కార్యక్రమాలను నాట్స్ చేపడుతుందని వివరించారు. పెదనందిపాడు ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ వీరరాఘవయ్య, నంది పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణలతో కళశాల ఆధ్యాపకులు కలిసి బాపయ్య చౌదరిని ఘనంగా సన్మానించారు.
(చదవండి: కర్నూల్‌లో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం!)
Comments
Please login to add a commentAdd a comment