‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. నేను నా కలెక్టర్‌ ఉద్యోగం చేసుకుంటా | Sakshi
Sakshi News home page

‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. నేను నా కలెక్టర్‌ ఉద్యోగం చేసుకుంటా

Published Sun, Apr 14 2024 4:07 PM

Nisha Bangre A Former Deputy Collector Now Wants Her Job Back - Sakshi

భోపాల్‌ : మీకో దండం!!.. మీ పార్టీకో దండం.. నేను నా డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం చేసుకుంటానంటూ మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ మహిళా నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో డిప్యూటీ కలెక్టర్‌ హోదాను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తనని కాంగ్రెస్‌ మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ, లోక్‌సభ సీటును నిరాకరించి పార్టీ తనకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన నిషా బాంగ్రే ఇప్పుడు తన ఉద్యోగాన్ని తిరిగి పొందాలని కోరుతున్నట్లు తెలిపారు.  

నిషా బాంగ్రే మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. అయితే డిప్యూటీ కలెక్టర్‌గా హోదాలో ఉన్నతమైన సేవలందించినందుకు ప్రజలు తనని రాజకీయాల్లోకి రావాలని కోరారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బాంగ్రేను సంప్రదించింది. తమ పార్టీలో చేరితే రాజకీయంగా సముచితం స్థానం కల్పిస్తామని ఆశచూపించింది. అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టింది.

కాంగ్రెస్‌ నాయకత్వం ఒప్పుకోలేదు
‘కాంగ్రెస్ నన్ను సంప్రదించింది. అప్పుడే డిప్యూటీ కలెక్టర్‌ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్లాలనే అనుకున్నాను. నాకు రాజకీయ నేపథ్యం లేదు. ఆర్థికంగా బలమైన కుటుంబం కూడా కాదు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరాను. చివరకు ఎమ్మె‍ల్యే టికెట్‌ దక్కలేదు. బీజేపీ కావాలంటే నాకు టికెట్ ఇచ్చేది. కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఇవ్వలేదు. చదువుకున్న మహిళ రాజకీయాల్లోకి రావడానికి కాంగ్రెస్ బెతుల్ జిల్లా నాయకత్వం భయపడింది’ అని బాంగ్రే అన్నారు .

ఫలితాలతో పరిస్థితులు తారుమారు
అసెంబ్లీ ఫలితాల తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. కాంగ్రెస్‌ అన్నీ కమిటీలను రద్దు చేసింది. బాధ్యతలు అప్పగించలేదు. కనీసం ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చినా విలువైనా ఉండేది. లోక్‌సభ సీటు ఇవ్వలేదు. అందుకే నన్ను తిరిగి ఉద్యోగంలో చేరాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. నా రాజీనామాను కేంద్రం అంగీకరించలేదు. తిరిగి విధుల్లో చేరేందుకు వీలుంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. డిప్యూటీ కలెక్టర్‌గా బాద్యతులు చేపట్టాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు.  

నిషా బాంగ్రే ఆరోపణలపై కాంగ్రెస్
పార్టీలో చేరే వ్యక్తులు ఎమ్మెల్యే,లోక్‌సభ టికెట్లు పొందొచ్చు. ఇందుకోసం వారు కష్టపడి పనిచేయాలి. నిషా బాంగ్రేకి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించాం. రాజకీయాల్లో కెరీర్‌ను నిర్మించుకోవడానికి సమయం పడుతుంది. ఆమె పార్టీని వదిలి వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చు అని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 

Advertisement
Advertisement