కేశంపేటలో టెన్షన్‌.. టెన్షన్‌ | Sakshi
Sakshi News home page

కేశంపేటలో టెన్షన్‌.. టెన్షన్‌

Published Thu, May 9 2024 10:20 AM

కేశంపేటలో టెన్షన్‌.. టెన్షన్‌

కేశంపేట: ఆ రెండు పార్టీల నేతల పోటాపోటీ నినాదాలతో షాద్‌నగర్‌ నియోజకవర్గం కేశంపేటలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వివరాలు.. జిల్లాలోని షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని కేశంపేటలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బుధవారం దాదాపు ఒకే సమయంలో ప్రచారం చేపట్టాయి. ప్రచారానికి సంబంధించి ఆయా పార్టీల నాయ కులు అనుమతులు కూడా తీసుకున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు అంబేద్కర్‌ చౌరస్తాలో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకె అరుణతో పాటు ఆ పార్టీ ముఖ్యనాయకులు కేశంపేటకు చేరుకున్నారు. ఈ క్రమంలో బీజీపీ నాయకులు కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌ వైపు వెళ్లకుండా వైఎస్సార్‌ చౌరస్తా వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వారిని నిలువరించారు. అయితే ఈ మార్గం గుండా ర్యాలీ నిర్వహించేందుకు తమకు అనుమతులు ఉన్నాయని, ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

పోటాపోటీ నినాదాలు..

ఈ క్రమంలో వైఎస్సార్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించడంతో పాటు పోలీసు లను తోసుకుంటూ బీజేపీ నాయకులు.. కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌ జరుగుతున్న అంబేద్కర్‌ చౌరస్తా వైపు దూసుకెళ్లారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకేచోటకు రావడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు జై మోదీ, జై బీజేపీ, జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్‌ నాయకులు జై కాంగ్రెస్‌, జై సోనియా అంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటకముందే పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పి శాంతింపజేశారు.

ఒకే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ప్రచారం

కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌ వైపు దూసుకెళ్లేందుకు కమలదళం యత్నం

బారికేడ్లు, పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లిన నేతలు

పోటాపోటీగా ఇరువర్గాల నినాదాలు

Advertisement
 
Advertisement
 
Advertisement