పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు పెంపు | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు పెంపు

Published Thu, May 9 2024 10:20 AM

-

సాక్షి, రంగారెడ్డి జిల్లా: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్ల (వీఎఫ్‌సీ) ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వేసే ఓటింగ్‌ గడువును ఎన్నికల సంఘం ఈనెల 10వ తేదీ(శుక్రవారం) వరకు పొడిగించిందని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక తెలిపారు. వాస్తవానికి బుధవారంతో గడువు ముగియగా.. ఎన్నికల కమిషన్‌ మరో రెండు రోజుల పాటు గడువు పొడిగించిందని.. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఈనెల 7వ తేదీ వరకు 16,088 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. అలాగే 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు 994 మంది.. ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌లో భాగంగా ఇంటినుంచే ఓటుహక్కును వినియోగించుకున్నారని కలెక్టర్‌ తెలిపారు.

సెకెండ్‌ ర్యాండమైజేషన్‌ పూర్తి..

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి సంబంధించిన అదనపు ఈవీఎంల సెకండ్‌ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక నేతృత్వంలో సాధారణ పరిశీలకులు రాజేందర్‌ కుమార్‌ కటారియా, వ్యయ పరిశీలకులు రాజీవ్‌ చావ్రా సమక్షంలో అదనపు కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వీవీ ప్యాట్ల రెండవ విడత ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని వికారాబాద్‌ జిల్లాలో గల పరిగి, వికారాబాద్‌, తాండూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కమిషనింగ్‌ సందర్భంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన ఈవీఎంల స్థానంలో అదనంగా కేటాయించబడిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు బుధవారం రెండవ విడత సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. పోలింగ్‌ సమయంలో ఎక్కడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే, నిమిషాల వ్యవధిలోనే సెక్టోరల్‌ అధికారులు సంబంధిత పోలింగ్‌ స్టేషన్‌కు చేరుకుంటే తమ వద్ద రిజర్వ్‌లో ఉండే కంట్రోల్‌ యూనిట్లను సమకూరుస్తారని కలెక్టర్‌ తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు, వారి తరఫున ప్రతినిధులు, సంబంధిత అధికారులు ఈ ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారు.

కంట్రోల్‌ రూమ్‌ సందర్శన..

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) సెంటర్‌ను, కంట్రోల్‌ రూమ్‌ను ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీవ్‌ చావ్రా బుధవారం పరిశీలించారు. ఎంసీఎంసీలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఐడీఓసీలో నెలకొల్పిన కంట్రోల్‌ రూంను సందర్శించారు. 1950 టోల్‌ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరుతెన్నులు గమనించారు. చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీ బృందాల పని తీరు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాల పనితీరును కంట్రోల్‌ రూంలో జీపీఆర్‌ఎస్‌ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు.

10వ తేదీ వరకు ఓటువేసే అవకాశం

ఎన్నికల సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలి: ఆర్‌ఓ, కలెక్టర్‌ శశాంక

Advertisement
 
Advertisement