ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఐఫోన్ ఉత్పత్తుల్లో ప్రతి ఏడింటిలో ఒకటి భారత్‌లోనే తయారవుతోందని ప్రధానిమోదీ అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్‌ఐ) ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ..‘ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఎదిగింది. గ్లోబల్‌గా తయారువుతున్న ఏడు ఐఫోన్‌లలో ఒకటి ఇండియాలోనే తయారుచేస్తున్నారు. ఐఫోన్‌తోపాటు యాపిల్ ఉత్పత్తులను కూడా భారత్ రికార్డు సంఖ్యలో ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం ద్వారానే ఇది సాధ్యమైంది’ అని అన్నారు.
2028 నాటికి మొత్తం ఐఫోన్‌లలో 25 శాతం భారత్‌లోనే తయారవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి త్రైమాసికానికి సంబంధించి యాపిల్ ఉత్పత్తుల షిప్‌మెంట్‌లో దేశం రికార్డు స్థాయిని చేరుకుంది. దేశంలోని యాపిల్ ఉత్పత్తుల్లో ఏడాదివారీగా 19 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ తెలిపింది.
యాపిల్ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్‌లెట్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్‌లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.
ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదవుతోందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనల ద్వారా తెలిసింది. త్వరలో భారత్‌లో మరో మూడు స్టోర్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్‌లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్‌లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment