యాపిల్‌ తయారీ ప్లాంట్‌ అమెరికాకు తరలింపు | Trump revealed that Apple CEO Tim Cook planning to shift manufacturing from Mexico to US | Sakshi
Sakshi News home page

యాపిల్‌ తయారీ ప్లాంట్‌ అమెరికాకు తరలింపు

Published Mon, Feb 24 2025 12:24 PM | Last Updated on Mon, Feb 24 2025 1:16 PM

Trump revealed that Apple CEO Tim Cook planning to shift manufacturing from Mexico to US

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మెక్సికోలోని సంస్థ తయారీ యూనిట్‌ను అమెరికాకు తరలించే యోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కుక్ మెక్సికోలో రెండు ప్లాంట్లను నిలిపివేశారని, దానికి బదులుగా అమెరికాలో ఉత్పత్తులను తయారు చేస్తారని అమెరికా గవర్నర్ల సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. పెరుగుతున్న టారిఫ్ ఒత్తిళ్లు, కొనసాగుతున్న అమెరికా-చైనా వాణిజ్య వివాదానికి ప్రతిస్పందనగా ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కొందరు భావిస్తున్నారు.

అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల టిమ్ కుక్ ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. చైనాలో యాపిల్‌ తన తయారీ ప్లాంట్‌ నుంచి భారీగానే వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అందులో కొంతభాగం అమెరికాకూ ఎగుమతి అవుతోంది. అయితే ఇటీవల అమెరికా-చైనాల మధ్య సుంకాల విషయంలో తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో టిమ్‌ కుక్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. కానీ  గతంలో మాదిరి కాకుండా ఈసారి యాపిల్‌కు ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ట్రంప్ కుక్‌తో సమావేశమైన మరుసటి రోజే యూఎస్‌కు తయారీ ప్లాంట్‌ తరలింపు ప్రకటన చేయడం చర్చనీయాంశం అయింది.

అమెరికాలో పెట్టుబడులు..

అమెరికాలో వందల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానని కుక్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఈ పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుందని, యూఎస్‌ సరఫరా గొలుసును బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య వల్ల దేశీయ ఉత్పత్తిని పునరుద్ధరించడం, బాహ్య ఆర్థిక ఒత్తిళ్ల నుంచి కీలక పరిశ్రమలను రక్షించవచ్చని చెప్పారు. కంపెనీలు తీసుకునే నిర్ణయాలు తన పరిపాలన విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఎస్‌బీఐ ధోనీకి రూ.6 కోట్లు, అభిషేక్‌కు రూ.18 లక్షలు చెల్లింపు

యాపిల్‌పై ప్రభావం

ట్రంప్‌ వ్యాఖ్యలకు సంబంధించి యాపిల్‌ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇది సంస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. తయారీ కార్యకలాపాలను అమెరికాకు తరలించడం ద్వారా దిగుమతి సుంకాల ప్రభావాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇది లాభాల మార్జిన్లు, ధరలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యూహాత్మక మార్పు ఉద్యోగాల కల్పనతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement