Telangana Crime News: 'మనీషా, శివాని ఆత్మహత్య'పై.. ఇద్దరు అనుమానితులు అదుపులోకి..
Sakshi News home page

'మనీషా, శివాని ఆత్మహత్య'పై.. ఇద్దరు అనుమానితులు అదుపులోకి..

Published Fri, Sep 8 2023 1:52 AM

- - Sakshi

నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు మనీషా, శివాని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నల్లగొండ టూటౌన్‌ పోలీసులు గురువారం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. విద్యార్థినుల ఇద్దరి ఫోన్‌లో కాల్‌ డేటా ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నారు.

ఎవరితో ఎక్కువగా మాట్లాడారు? వాట్సాప్‌ చాటింగ్‌ ఎవరితో ఉంది? మెస్సేజ్‌ల వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరిస్తున్నాడని.. వాడు ఎవడో తెలియదని ఆ విద్యార్థులు మాట్లాడినట్లు ఫోన్‌ రికార్డు వైరల్‌ కావడంతో ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది. పరువు పోతుందని ఫోన్‌లో ఏమైనా ఫొటోలు ఉంటే విద్యార్థులు డిలీట్‌ చేశారా? అనే కోణంలో ఫోన బ్యాకప్‌ను పరిశీలిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వివరాలను డిలీట్‌ చేసిన వివరాలను సైబర్‌ క్రైం విభాగం నుంచి బ్యాకప్‌ తీసి పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు వచ్చిన ఇన్‌కం, అవుట్‌ గోయింగ్‌ ఫోన్‌ కాల్స్‌ కూడా పరిశీలిస్తున్నారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో బస్సు దిగిన విద్యార్థులు నడుచుకుంటూ ప్రకాశంబజార్‌కు అటునుంచి రాజీవ్‌పార్కులోకి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తే ఇద్దరు విద్యార్థినులు ఉత్సాహంగా నడుచుకుంటూ వెళ్తూ కనిపించారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత పార్కులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు సాంకేతికంగా ఉన్న అన్ని ఆధారాలనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. లోకేషన్‌ ఆధారంగా.. ఇద్దరు విద్యార్థులకు ఏ ప్రాంతాల నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి? ఆ సమయంలో వీరిద్దరు ఎక్కడ ఉన్నారని ట్రేస్‌ చేస్తున్నారు.

డీపీలో ఫొటోలు పెట్టుకోవద్దు..
దర్యాప్తులో భాగంగా పోలీసులు గురువారం విద్యార్థినుల స్వగ్రామాలకు వెళ్లి విచారించారు. నక్కలపల్లి గ్రామంలో శివాని స్నేహితుల నుంచి, అమ్మనబోలు గ్రామానికి మనీషా క్లాస్‌మేట్లు, స్నేహితుల నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు. అయితే, అమ్మాయిలు తమ ఇన్‌స్ట్రాగామ్‌లో డీపీగా ఫొటోలు పెట్టుకోవద్దని శివాని గ్రామంలోని స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. ఎందుకు పెట్టుకోవద్దని అడిగితే సమాధానం చెప్పలేదని ఆమె స్నేహితులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. నక్కలపల్లిలో ఇటీవల ఓ మహిళ ఎస్సై ఉద్యోగం సాధించడంతో.. డిగ్రీ పూర్తి కాగానే మనం కూడా ఎస్సై ఉద్యోగం సాధించాలని ఇద్దరు విద్యార్థినులు నిర్ణయించుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది.

Advertisement
Advertisement