1:3 నిష్పత్తిలో ప్రకటించనున్న టీఎస్‌పీఎస్సీ
వెంటనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అతి త్వరలో గ్రూప్–4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ప్రకటించనుంది. ఈ కేటగిరీలో 8,180 ఉద్యోగాలకు గాను 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జూలై 1వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఓఎంఆర్ ఆధారిత అర్హత పరీక్షలను టీఎస్‌పీఎస్సీ నిర్వహించింది. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 7,62,872 మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాతో కూడిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను (జీఆర్‌ఎల్) వెబ్‌సైట్‌లో ఉంచింది.
ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను విడుదల చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. అయితే డిజేబుల్డ్ (దివ్యాంగులు) కేటగిరీలో మాత్రం 1:5 నిష్పత్తిలో ఎంపిక చేపట్టనుంది. ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల చేసిన వెంటనే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేలా టీఎస్‌పీఎస్సీ కార్యాచరణ రూపొందించింది. అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2021–22 సంవత్సరం తర్వాత తీసుకున్న సర్టిఫికెట్‌ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. అదే విధంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు, వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన తేదీలతో కూడిన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఏ క్షణంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఖరారు కావచ్చునని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment