సైబర్‌ నేరగాళ్ల మైండ్‌ ‘బ్లాక్‌’ | center is blocking the handsets as well | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్ల మైండ్‌ ‘బ్లాక్‌’

Published Sat, May 18 2024 6:14 AM | Last Updated on Sat, May 18 2024 6:14 AM

center is blocking the handsets as well

ఒకప్పుడు కేవలం బ్యాంకు ఖాతాలు మాత్రమే స్తంభన 

ఆపై వారి సెల్‌ఫోన్‌ నంబర్లకూ వర్తించిన ఈ విధానం 

తాజాగా హ్యాండ్‌సెట్స్‌నూ బ్లాక్‌ చేయిస్తున్న కేంద్రం 

ఇటీవలే 28,200 హ్యాండ్‌సెట్స్‌ బ్లాక్‌ చేయాలంటూ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌ : సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ చెప్పడానికి కేంద్రప్రభుత్వం మరో కీలకనిర్ణయం తీసుకుంది. వీరు వినియోగించే మొబైల్‌ఫోన్లు బ్లాక్‌ చేయిస్తోంది. తాజాగా 28,200 çహ్యాండ్‌సెట్స్‌ బ్లాక్‌ చేయాలని ఆయా సర్విస్‌ ప్రొవైడర్లను ఆదేశించింది. ఈ ఫోన్లలో వాడిన 20 లక్షల ఫోన్‌నంబర్ల పూర్వాపరాలు మరోసారి పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ–కేటుగాళ్లు గత ఏడాది ‘గ్రేటర్‌’పరిధిలోని బాధితుల నుంచి ఏకంగా రూ.621 కోట్లు కాజేశారంటే సైబర్‌ నేరాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.  

డార్క్‌నెట్‌లో దొరుకుతున్న డేటా 
ఉత్తరాదికి చెందిన సైబర్‌ నేరగాళ్లు అక్కడి నుంచే దేశవ్యాప్తంగా బాధితులను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. అయితే దీనికి సెల్‌ఫోన్‌ వినియోగదారుల వివరాలు అత్యంత కీలకం. వీరి నంబర్లతో కూడిన డేటా సైబర్‌ నేరగాళ్లకు డార్క్‌నెట్‌లో తేలిగ్గా దొరుకుతోంది. లక్ష మందికి సంబంధించిన ఫోన్‌ నంబర్లను కేవలం రూ.30 వేలకు విక్రయించేవారు అనేకమంది ఉన్నారు. ఈ డేటా వీరి వద్దకు ఎలా చేరుతోందనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.

ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులు  
సైబర్‌ నేరగాళ్లు తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ బాధితుడు పోలీస్‌ ఫిర్యాదు చేసినా, దర్యాప్తులో ముందుకు వెళ్లకుండా, వారికి ఎలాంటి ఆధారాలు చిక్కకుండా ఉండేలా ప్లాన్‌ చేశారు. బ్యాంకు ఖాతాలు, సెల్‌నంబర్లు ఇలా ఏదీ తమ పేరుతో లేకుండా చూసుకుంటున్నారు. వీరికి అవసరమైన బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులను సరఫరా చేయడానికి కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. ఇతరుల పేర్లతో ఓపెన్‌ చేసిన బ్యాంకు ఖాతాలతోపాటు ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌ కార్డులు సేకరించి సైబర్‌ నేరగాళ్లకు ఈ ముఠాలు అందజేస్తున్నాయి. బ్యాంకు ఖాతాలు ఇచి్చనందుకు కమీషన్లు, సిమ్‌కార్డుకు అధిక రేటు వీరికి దక్కుతోంది.

ఆ రెండింటితో ఉపయోగం లేక... 
సైబర్‌ నేరగాళ్లను కట్టడి చేయడానికి కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తొలినాళ్లలో సైబర్‌ నేరాలతో సంబంధం ఉన్న బ్యాంకు ఖాతాలను బ్లాక్‌ చేసేది. ఈ విధానం పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో మరో అడుగు వేసింది. సైబర్‌ నేరగాళ్లు వినియోగించినట్టు, వినియోగించే అవకాశమున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించిన సెల్‌ఫోన్‌ నంబర్లను బ్లాక్‌ చేయడం మొదలెట్టింది. దీంతో తెలివిమీరి వ్యవహరిస్తున్న ఆ కేటుగాళ్లు అధిక సంఖ్యలో ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులు సమీకరించడం మొదలెట్టారు. ఒక్కో నేరానికి ఒక్కో సిమ్‌ వాడుతున్నారని అధికారులు గుర్తించారు.  

ఫోన్లు బ్లాక్‌ చేసేలా తాజా నిర్ణయం  
సైబర్‌ నేరగాళ్లు వినియోగిస్తున్న హ్యాండ్‌సెట్స్‌ను బ్లాక్‌ చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ బాధ్యతల్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డీఓటీ) పర్యవేక్షించడం మొదలెట్టింది. సైబర్‌ నేరాల్లో బాధితులుగా మారినవారు నేరుగా, ఆన్‌లైన్‌ ద్వారా పోలీసులు లేదా సంబంధిత ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. లిఖిత పూర్వకంగా, 1930కు కాల్‌ చేయడం ద్వారా, వెబ్‌సైట్, యాప్‌ల్లో దాఖలవుతున్న వీరి ఫిర్యాదుల్లో తమను సంప్రదించడానికి సైబర్‌ నేరగాడు వినియోగించిన ఫోన్‌ నంబర్‌ వివరాలు ఉంటున్నాయి. ఈ డేటా ఆధారంగానే డీఓటీ మొబైల్‌ ఫోన్లు బ్లాక్‌ చేసేలా చర్యలు తీసుకుటోంది.  

సర్విసు ప్రొవైడర్ల సహకారంతో.. 
ఈ సెల్‌ఫోన్‌ హ్యాండ్‌సెట్లు గుర్తించడం, బ్లాక్‌ చేయడంలో ఆయా నెట్‌వర్క్‌ సర్విస్‌ ప్రొవైడర్ల పాత్ర అత్యంత కీలకం. ప్రతి సెల్‌ఫోన్‌కు ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్యూప్‌మెంట్‌ ఐడెంటిఫికేషన్‌గా (ఐఎంఈఐ) పిలిచే ప్రత్యేక నంబర్‌ ఉంటుంది. ఏ కంపెనీ సిమ్‌ వాడుతుంటే ఆ సర్వీస్‌ ప్రొవైడర్ల వద్ద ఈ ఐఎంఈఐ రిజిస్టర్‌ అవుతుంది. బాధితుల ఫిర్యాదులో ఉన్న సెల్‌నంబర్‌ ఆధారంగా సర్విస్‌ ప్రొవైడర్ల సహకారంతో డీఓటీ ఐఎంఈఐ నంబర్లను గుర్తిస్తోంది. వీటితో జాబితా రూపొందించి ఆయా సర్విస్‌ ప్రొవైడర్లకు పంపిస్తోంది. దీని ఆధారంగా ఈ ఐఎంఈఐ నంబర్లు ఉన్న ఫోన్లు పనిచేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఆ హ్యాండ్‌సెట్‌ బ్లాక్‌ అయిపోతోంది. ఇటీవల కాలంలో నేరగాళ్లు స్కైప్‌ కాల్స్‌ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఈ తరహాకు చెందిన స్కైప్‌ ఖాతాలను కేంద్రం బ్లాక్‌ చేయిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement