పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
19న దక్షిణ అండమాన్ సముద్రంలోకి నైరుతి..
రాష్ట్రవ్యాప్తంగా 1.71 సెం.మీ సగటు వర్షపాతం
2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలుచోట్ల మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని హెచ్చరించింది. మధ్యప్రదేశ్ కు నైరుతి ప్రాంతంలో చక్రవాతపు ఆవర్తనం (సైక్లోనిక్ సర్క్యులేషన్) కేంద్రీకృతమై ఉందని, ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. అదే విధంగా రాయలసీమ, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతంలో మరో చక్రవాతపు ఆవర్తనం కేంద్రీకృతమై ఉన్న ట్లు వాతావరణ శాఖ వివరించింది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాం గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలులో 6.75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.71 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం మించి వానలు కురవడం గమనార్హం.
తగ్గిన ఉష్ణోగ్రతలు: శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాలను పరిశీలిస్తే..ఆదిలాబాద్‌లో అత్యధికంగా 37.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో అతి తక్కువగా 21.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండురోజుల్లో కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈనెల 19న దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల వరకు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లలో)
కేంద్రం గరిష్టం
ఆదిలాబాద్ 37.8
భద్రాచలం 35.2
దుండిగల్ 31.8
హకీంపేట్ 31.8
హనుమకొండ 30.0
హైదరాబాద్ 31.9
ఖమ్మం 35.0
మహబూబ్‌నగర్ 34.9
మెదక్ 33.8
నల్లగొండ 36.0
నిజామాబాద్ 35.3
రామగుండం 33.2
Comments
Please login to add a commentAdd a comment