పెట్స్‌.. అదో స్టేటస్‌!  | Sakshi
Sakshi News home page

పెట్స్‌.. అదో స్టేటస్‌! 

Published Sun, Jul 31 2022 7:01 AM

City Dwellers Interest In Exotic Pets Become Status Symbol - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరవాసుల స్టేటస్‌ సింబల్‌ మారింది. లగ్జరీ వాహనాలు, హై ఎండ్‌ గృహాలు, విదేశీ ఫర్నీచర్‌, లైఫ్‌ స్టయిల్‌ జాబితాలో విదేశీ పెంపుడు జంతువులు కూడా చేరిపోయాయి. సినీ ప్రముఖులు, బడా వ్యాపారులు తమ వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్‌ హౌస్‌లు, లగ్జరీ విల్లాలలో విదేశీ పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. తాజాగా క్యాసినోవాలా చికోటి ప్రవీణ్‌ వ్యవసాయ క్షేత్రంలో ఎగ్జోటిక్‌ పెట్స్‌ను అటవీ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. విదేశాల్లోని అడవి జాతి పెంపుడు జంతువులను ఎగ్జోటిక్‌ పెట్స్‌ అంటారు. మన దేశంలో వీటి రవాణా వైల్డ్‌లైఫ్‌ యాక్ట్‌–1972 ప్రకారం చట్ట వ్యతిరేకం.

అమెరికా, ఆ్రస్టేలియా, మెక్సికో వంటి విదేశాల నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకొని, విక్రయిస్తుంటారు. ఇటీవల కోల్‌కత్తా నుంచి హైదరాబాద్‌కు కంగారులను అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను వెస్ట్‌ బెంగాల్‌లోని కుమార్‌గ్రామ్‌ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో అధిక డిమాండే అక్రమ రవాణాకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇండియన్‌ బ్రీడ్‌ ఎగ్జోటిక్‌ పెట్స్‌ పెంపకానికి మన దేశంలో అనుమతి ఉంది. కానీ, ఆయా జంతువులను అటవీ శాఖ వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో ఈ తరహా వన్యప్రాణులు 150–200 రకాలుంటాయని అంచనా. 

నగరంలో 50కి పైగా ప్రైవేట్‌ జూలు.. 
ప్రస్తుతం నగరంలో 50కి పైగా ప్రైవేట్‌ జూలు ఉంటాయని బహుదూర్‌పల్లిలోని జూ అధికారి ఒకరు తెలిపారు. చేవెళ్ల, శంకర్‌పల్లి, కందుకూరు, శామీర్‌పేట, భువనగిరి వంటి పలు ప్రాంతాలలోని విశాలమైన ఫామ్‌ హౌస్‌లు, వ్యవసాయ క్షేత్రాలలో చిన్న పాటి జూలను ఏర్పాటు చేసి, వీటిని పెంచుతున్నారు. అలాగే పలువురు బడా డెవలపర్లు లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీలలో పెట్‌ పార్క్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. క్యాసినో వాలాగా పేరొందిన చికోటి ప్రవీణ్‌కు కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొండచిలువలు, ఊసరవెల్లి, మకావ్‌ చిలుకల వంటి వన్యప్రాణులున్నట్లు అధికారులు గుర్తించారు. 

అధ్యయనం చేశాకే పెంపకం.. 

  • ఎగ్జోటిక్‌ పెట్స్‌ జీవన విధానంపై అవగాహన ఉంటేనే పెంచుకోవాలి. లేకపోతే స్వల్పకాలంలోనే అనారోగ్యం పాలై చనిపోతాయని కూకట్‌పల్లిలోని ఎగ్జోటిక్‌ పెట్‌ విక్రయదారుడు, వెటర్నరీ స్టూడెంట్‌ యుగేష్‌ తెలిపారు. అవి ఏ జాతికి చెందినవి, ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి, వాటి ఆహారం, వాటికి వచ్చే రోగాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. 
  • సల్కాటా, ఆల్డాబ్రా టార్టాయిస్‌: ప్రారంభ ధర రూ.2.5 లక్షలు. 
  • ఇగ్వానా: ఆకుపచ్చ, నీలం, పసుపు రంగుల ఇగ్వానాల ప్రారంభ ధర రూ.15 వేలు. స్నో, థానోస్‌ రంగులవైతే రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉంటాయి. 
  • బాల్‌ పైథాన్‌: వీటిని రాయల్‌ పైథాన్స్‌ అని కూడా పిలుస్తారు. ధర రూ.35–40 వేలు.  
  • డెడ్‌ బియర్డ్‌ డ్రాగన్‌: తెల్ల గడ్డంలాగా ఉంటాయి. వీటిని వెనక్కి తిప్పినా ఎలాంటి చలనం ఉండదు. వీటి స్పర్శ చల్లగా, గట్టిగా ఉంటుంది. తెలుపు, గోధుమ, ఎరుపు రంగుల్లోని డ్రాగన్స్‌ ప్రారంభ ధర రూ.80 వేలు. 
  • కార్న్‌ స్నేక్‌: నార్త్‌ అమెరికాకు చెందిన ఈ కార్న్‌ స్నేక్స్‌ విషపూరితం కావు. జన్యురకం, రంగులను బట్టి వీటి ధరలు రూ.25–35 వేల మధ్య ఉంటాయి. 
  • మార్మోసెట్‌ కోతులు: సౌత్‌ అమెరికా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు చెందిన ఈ కోతులు ఆలివ్‌ గ్రీన్, గోధుమ రంగుల్లో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.5 లక్షలు.. 
  • మీర్కట్‌: దక్షిణాఫ్రికాకు చెందిన మీర్కట్స్‌ గోధుమ, తెలుపు రంగులో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.1.5 లక్షలు. 
  • రామచిలుకలు: బ్లాక్‌పామ్‌ కాకాటూ, విక్టోరియా క్రౌన్, గోల్డెన్‌ కోనూర్, అమెరికన్‌ క్రౌ వంటి రంగురంగుల రామచిలుకలు ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ. 30 వేలు.
  • యార్కి టెర్రియర్‌ డాగ్‌: అచ్చం బొమ్మలాగా నలుపు, గోధుమ రంగులలో ఈ కుక్క వీటి ప్రారంభ ధర రూ.85 వేలు. జోలో అనే రకం కుక్కలకు శరీరంపై వెంట్రుకలు ఉండకపోవటం వీటి స్పెషాలిటీ. గ్రే కలర్‌లో వీటి ధర రూ.లక్ష.   

(చదవండి: ‘ఫీజు’ లేట్‌.. మారని ఫేట్‌!)

Advertisement
 
Advertisement
 
Advertisement