అంతరించిపోయే దశలో నీటి వనరులు | Sakshi
Sakshi News home page

అంతరించిపోయే దశలో నీటి వనరులు

Published Thu, Apr 18 2024 5:30 AM

Endangered water resources - Sakshi

ఇష్టారాజ్యంగా నాలాలు, చెరువులు, కుంటల దురాక్రమణ 

చర్యలు చేపట్టకుంటే భవిష్యత్‌లో గుక్కెడు నీటికీ కటకట 

యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టేలా సర్కార్‌ను ఆదేశించాలి 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ లేఖ 

సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన సీజే ధర్మాసనం 

ప్రతివాదులుగా పలువురు అధికారులు.. నేడు విచారణ 

సాక్షి, హైదరాబాద్‌: మహా నగరం హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తూపోతున్నారని.. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే నీటి వనరులు లేని నగరంగా హైదరాబాద్‌ మారే ప్రమాదం పొంచి ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై విచారణ చేపట్టి యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం నీటివనరుల రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన లేఖ రాశారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణ, వాటి దుస్థితిని అందులో వివరించారు. ఈ లేఖను సీజే ధర్మాసనం.. సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్, హోంశాఖ, ఇరిగేషన్‌ అండ్‌ కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది. 

ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు 
‘అక్రమంగా నాలాలను ఆక్రమించి విల్లాల నిర్మాణం చేపడుతున్నారు. చెరువులు, కుంటలు సహా నీటివనరుల ఆక్రమణను ఇలానే వదిలేస్తే భవిష్యత్‌లో తాగునీటికీ కటకట ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చెరువులు, కుంటలనూ వదలని అక్రమార్కులు వాటిలోకి నీరు చేరకుండా పరీవాహక ప్రాంతాలనూ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే నగరంలోని చాలాప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. కొన్నిచోట్ల నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. సంప్రదాయ నీటివనరుల ఆక్రమణను ఇలా వదిలేస్తూ పోతే చెరువులు, నీటివనరులు, నాలాలు లేని నగరంగా హైదరాబాద్‌ త్వరలోనే మారుతుంది.

పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న ఆక్రమణలు, భారీ విల్లాల నిర్మాణాల కారణంగా హైదరాబాద్‌లోని నీటివనరులు అంతరించిపోయే పరిస్థితి. ఇది పర్యావరణంలో తీవ్ర అసమతుల్యతకు దారితీస్తోంది. భారీ వర్షాలు వస్తే నీరు సాఫీగా పోయే మార్గాలు లేక ఒత్తిడి పెరిగి వరదలు జనావాసాలను ముంచెత్తుతాయి. ఆస్తులకే కాకుండా ప్రజల జీవితాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చే ప్రమాదం లేకపోలేదు. చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ప్రజా జీవనం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. జనాభా నిష్పత్తికి తగ్గట్టు చెట్లు కూడా లేక స్వచ్ఛమైన గాలి అందడం లేదు. పర్యావరణం దెబ్బతిని ఎల్‌నినో, లానినో లాంటివి సంభవిస్తున్నాయి.

చెరువులు, నీటివనరులు, నాలాల పరిస్థితిపై రెడ్‌ అలర్ట్‌ ప్రకటించాలి. వాటిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలి. పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన పలు శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలి’అని జస్టిస్‌ వేణుగోపాల్‌ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్, జిన్నారం, పటాన్‌చెరు, ఆర్‌సీ పురం, కంది, సంగారెడ్డి, హత్పూర మండలాల్లో 90కి పైగా చెరువుల ఆక్రమణను ఆయన సీజే దృష్టికి తెచ్చారు. ఈ పిల్‌పై నేడు (గురువారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 

Advertisement
Advertisement